దీపావళి రిలీజ్ : దుష్యంత్ తండ్రి అజయ్ సింగ్ చౌతలాకు బెయిల్
హర్యానా రాష్ట్రంలో బీజేపీ - జేజేపీ సంకీర్ణంలోని ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ముఖ్యమంత్రిగా బీజేపీ నేత మనోహర్ లాల్ ఖట్టర్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇంతలోనే ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలా తండ్రి అజయ్ సింగ్ చౌతాలాకు రెండు వారాల బెయిల్ మంజూరైంది. ఆ వెనువెంటనే శనివారం సాయంత్రం ఆయన తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు.
కొడుకు ప్రమాణ స్వీకారానికి ఒక్కరోజు ముందే ఆయన బెయిల్‌పై విడుదల కావడం గమనార్హం. తండ్రి బెయిల్‌పై విడుదల కావడం పట్ల దుష్యంత్ హర్షం వ్యక్తం చేశారు. 'మా జీవితాల్లో గొప్ప మార్పు జరుగబోతున్న సందర్భంలో మా తండ్రి నా పక్కన ఉండటం కన్నా సంతోషం ఇంకేముంటుంది' అని వ్యాఖ్యానించారు. బీజేపీతో చేతులు కలుపడం ద్వారా ప్రజల తీర్పును అవమానించారంటూ కాంగ్రెస్ చేస్తున్న విమర్శలపై దుష్యంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలు కాంగ్రెస్‌కు బీజేపీ కన్నా తక్కువ సీట్లు కట్టబెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడంపైనే దృష్టిసారించామని చెప్పారు. తన ముత్తాత దేవీలాల్ 1977లోనే కాంగ్రెస్‌ను వీడారని గుర్తుచేశారు. హర్యానాలో కాంగ్రెస్ పదేండ్ల పాలన అత్యంత అవినీతిమయంగా సాగిందని ఆరోపించారు.