శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 అక్టోబరు 2019 (13:44 IST)

హర్యానాలో మరో కుమార స్వామి : కింగ్ మేకర్‌గా దుశ్యంత్

హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో ఓటర్లు ఏ పార్టీకి స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. ఫలితంగా హంగ్ అసెంబ్లీ ఏర్పాటుకానుంది. ముఖ్యంగా, అధికార బీజేపీ మరోమారు అధికారానికి దగ్గర్లోకి వచ్చి ఆగిపోయింది. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ మార్కు 46కు మరో ఐదు సీట్ల సమీపంలో ఆగిపోయింది. 
 
అలాగే, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఉంది. కానీ, ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు మాత్రం ఈ ఎన్నికల్లో సత్తా చాటారు. అలాగే, జననాయక్ జనతా పార్టీ పేరుతో కొత్త పార్టీని స్థాపించిన మాజీ సీఎం చౌతలా తనయుడు దుశ్వంత్ చౌతలా సత్తా చాటాడు. ఈయన సారథ్యంలోని జేజేపీ ఏకంగా 10 సీట్లు కైవసం చేసుకునే దిశగా సాగుతున్నాడు. 
 
దీంతో దుశ్యంత్ చౌతలా పేరు ఇపుడు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. హర్యానా అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు లేవని తేలడంతో, ఈ ఎన్నికల్లో బరిలోకి దిగి 10 స్థానాల్లో విజయాన్ని దాదాపు ఖాయం చేసుకున్న జేజేపీ ప్రభుత్వ ఏర్పాటులో ఇప్పుడు అత్యంత కీలకమైంది. దుశ్యంత్ చౌతాలా కింగ్ మేకర్‌గా మారాడు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దుశ్యంత్‌తో సంప్రదింపులు ప్రారంభించినట్టు తెలుస్తోంది.
 
బీజేపీ తరపున ఆ పార్టీ మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ నేతలు దుశ్యంత్‌తో చర్చలు ప్రారంభించారు. మరోవైపు తమకు మద్దతిస్తే, డిప్యూటీ సీఎం పదవిని దుశ్యంత్‌కు ఇస్తామని కాంగ్రెస్ ఆఫర్ చేసినట్టు సమాచారం. ప్రస్తుత ఫలితాల సరళి ప్రకారం బీజేపీ 37, కాంగ్రెస్ 31, జేజేపీకి 10, ఇతరులకు 10 చొప్పున సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇదే సరళి కొనసాగితే మేజిక్ ఫిగర్ 46 సీట్లను ఏ పార్టీ చేరుకునే పరిస్థితి ఉండదు. అప్పుడిక హంగ్ అనివార్యం. దుశ్యంత్ చౌతాలా కీలకం.