1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 జులై 2025 (14:53 IST)

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

saroja devi
అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో పాటు వయోభారంతో బాధపడుతూ వచ్చిన ఆమె... సోమవారం ఉదయం బెంగుళూరులో కన్నుమూశారు. ఆమె మృతి వార్తను తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇదే విషయంపై వారు వేర్వేరుగా తమ సంతాప సందేశాలను విడుదల చేశారు. 
 
తెలుగు, కన్నడ, తమిళ భాషా చిత్రాల్లో నటించిన బి.సరోజా దేవి, తన నటనతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు. ఆమె మరణవార్త తెలుసుకుని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
 
"అలనాటి ప్రముఖ నటి బి. సరోజాదేవి బెంగుళూరులో తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర విచారం కలిగింది. తెలుగు, తమిళ, కన్నడ భాషా చిత్రాలలో కథానాయకిగా ఆమె అనేక ప్రశంసలు అందుకున్నారు. మహా నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్‌తో కలిసి ఎన్నో చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను" అంటూ సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు.
 
పవన్ కూడా సోషల్ మీడియా ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు. "ప్రముఖ నటి బి. సరోజాదేవి గారు కన్నుమూశారని తెలిసి బాధపడ్డాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. 1955 నుంచి దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు, కన్నడ, తమిళ భాషా చిత్రాల్లో నటించి చిత్ర సీమపై తనదైన ముద్రను వేశారు. భూకైలాస్, పాండురంగ మహత్యం, సీతారామ కళ్యాణం, జగదేకవీరుని కథ, శకుంతల, దానవీర శూర కర్ణ, ఆత్మబలం లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. బి.సరోజా దేవి గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను" అని పేర్కొన్నారు.