శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 16 నవంబరు 2019 (17:31 IST)

విదేశాలకు ఐఎంఎస్ స్కాం సొమ్ము..'ఆదాబ్' చేతిలో బినామీ కంపెనీల జాబితా

డబ్బు కక్కుర్తి ఎంత పనైనా చేయిస్తోంది. అందుకు తాజా ఉదాహరణ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) మందుల కొనుగోలు కుంభకోణం. ఇందులో డొల్ల కంపెనీలపై ఏసీబీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

దీంతో నిందితులకు ఉచ్చు బిగుసుకొంటున్నది. అయితే ఈ మందులను తిన్న వారు తాము అక్రమంగా సంపాదించిన వందల కోట్ల రూపాయలను విదేశాలకు తరలించారు. అక్కడ ఏకంగా రిసార్ట్స్, హోటళ్ళల్లో భాగస్వాములుగా మారారు. ముందుగా ఈ కుంభకోణం కుంభస్థలం పగలగొట్టింది 'ఆదాబ్ హైదరాబాద్'.
 
పుట్టి ముంచిన పుత్రవాత్సల్యం:
తేజా ఫార్మ 2013 వరకు తేజ ఫార్మ వ్యాపారంలో రాణించలేదు. కాగా దేవికారాణి ఇఎస్‌ఐ డైరెక్టర్‌గా విధులు చేపట్టినప్పటి నుంచి తేజఫార్మ పుంజుకుంది. తేజాఫార్మను బినామీగా చేసుకుని కోట్లాది రూపాయల మందుల కొనుగోళ్లకు పాల్పడినట్లు తేలింది. తేజాఫార్మలో దేవికారాణి తనకు కుమారుడిని వాటా దారునిగా చేసి మందుల కొనుగోళ్లు జరిపింది.

దేవికారాణి కుమారుడిని ఒరిజిన్ ఫార్మా, సెరిడియా కంపెనీలలో వాటా దారునిగా చేసి పెద్ద ఎత్తున ఆయా కంపెనీల నుంచి వైద్య పరికరాలు, మందులు కొనుగోలు చేశారు. ఒరిజిన్ కంపెనీ యజమాని శ్రీకాంత్, తేజాఫార్మా అధినేత రాజేష్, మందుల సరఫరా దారుడు శంకర్‌లు ఇఎస్‌ఐ డైరెక్టర్ దేవికారాణి బినామీలుగా ఉన్నారు.

దేవికారాణి ఇఎస్‌ఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన 2014 నుంచి ప్రభుత్వ ధనాన్ని దిగిమింగింది. బినామి మెడికల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలతో చేతులు కలిపి మం దులు సరఫరా కానప్పటికీ బిల్లులు సృష్టించి ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టింది. మందుల వైద్య పరికరాల స్టాక్ ఎంట్రి రికార్డులో తన చేతి వాటం చూపుతూ దశల వారీగా రూ.200 కోట్ల మేర అక్రమంగా ఆర్జించింది. 

ఇందుకు కార్యాలయ అటెండర్ రమేష్‌బాబు, క్లర్క్ ఉపేందర్, సూపరింటెండెంట్ వీరన్నలు కీలక పాత్ర వహించారని వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించేందుకు ఎసిబి అధికారులు సమాయత్తమౌతున్నారు. ఇఎస్‌ఐ డిపార్ట్‌మెంట్‌లో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్న నాగలక్ష్మిని పర్చేసింగ్ విభాగంలో విధుల అప్పగించి దోపిడికి పాల్పడటమే కాకుండా నాగలక్ష్మిని బినామీగా మార్చుకున్నట్లు ఎసిబి అధికారులు గుర్తించారు.

ఫార్మసిస్ట్ నాగలక్ష్మి డైరెక్టర్ దేవికారాణికి కుడి భుజంగా ఉంటూ 5 మందుల కంపెనీలకు బినామీగా ఉంటూ వచ్చింది. ఒక దశలో ఇఎస్‌ఐలో నాగలక్ష్మి షాడో డైరెక్టర్‌గా వ్యవహరించిందని అధికారులు తెలిపారు. డైరెక్టర్ దేవికారాణి అక్రమాలలో భాగంగా పుట్టుకొచ్చిన బినామీ కంపెనీలను ఇప్పటికే అధికారులు గుర్తించారు. 
 
ఇవే బినామీ కంపెనీలు:
డైరెక్టర్ దేవికారాణి అక్రమాలలో భాగంగా పుట్టుకొచ్చిన బినామీ కంపెనీలు ఉన్నాయి. వాటిలో పృధ్వి ఎంటర్ ప్రైజెస్, మైత్రి ఫార్మా, మహిధర మెడికల్, సర్జికల్స్, ఆర్‌ఆర్ ట్రేడర్స్, వైష్ణవ ఎంటర్‌ప్రైజెస్, గాయ త్రి ఫార్మా, వసుధా మార్కెటింగ్ ఫార్మాస్కుటికల్, సర్జికల్ డిస్టిబ్యూటర్స్, సికోత్రిక్ ఫార్మా, స్వస్తిక్ ఫార్మాస్కుటికల్స్, హిమాలయ ఫార్మా, శ్రీరామ ఫార్మా డిస్టిబ్యూటర్స్, గాయత్రి ఫార్మాలున్నాయి. 
 
నవాజ్.. బినామీ రాజ్:
బినామీ కంపెనీల పట్ల పూర్తి అవగాహన ఉన్న నావాజ్ రెడ్డి సర్జికల్ పరికరాల కొనుగోలులో బినామీ కంపెనీలు సృష్టించి దాదాపు రూ.95 కోట్ల నిధుల స్వాహాకు సహకరించాడు. ఈక్రమంలో నవాజ్‌రెడ్డి రూ.30 కోట్లు తన వాటా తీసుకుని సంగారెడ్డి, గచ్చిబౌలి, బిహెచ్‌ఇఎల్‌ లో కొన్న భూములపై ఏసీబీ కన్ను పడింది.
 
'పెన్ డ్రైవ్'లో బాగోతం:
ఇఎస్‌ఐలో అకౌంట్స్ విభాగంలో ఆఫీస్ సూపరింటెండెంట్‌ గా విధులు నిర్వర్తించిన వీరన్న డైరెక్టర్ దేవికారాణి బినామీగా వ్యవహరించాడు. ఇతగాడికి ఉన్న హాబీ ఏమిటంటే ప్రతి విషయం తన పెన్‌డ్రైవ్‌ లో లోడ్ చేసుకుంటాడు. అలాగే బినామీ కంపెనీల జాబితా కూడా ఎంచక్కా తనతో పాటే ఉన్న పెన్ డ్రవ్ లో లోడ్ చేసుకొని చిక్కాడు.  
 
భూములు కొన్న వీరుడు:
ప్రభుత్వం నుంచి ఇఎస్‌ఐకి బిల్లులు పొందే విషయంలో వీరన్న కీలక పాత్ర పోషించాడు. ఈక్రమంలో ఇఎస్‌ఐ డైరెక్టర్ దేవికారాణి అవినీతికి సహకరించిన వీరన్న రూ. 40 కోట్లు అక్రమంగా ఆర్జించి తన తండ్రి, సోదరుడి పేరిట భూములు కొన్నారు. 
 
అబ్బసొత్తులా రూ.500 కోట్లు విడుదల:
ఇఎస్‌ఐ డైరెక్టర్‌ గా దేవికారాణి విధులు చేపట్టిన కాలంలో ప్రభుత్వం దాదాపు 500 కోట్ల రూపాయలు కేవలం మందుల కొనుగోలుకు విడుదల చేసింది. ఈ క్రమంలో 2015, 2016 కాలంలో ప్రభుత్వం రూ. 143 కోట్లు, 2016,2017 కాలంలో రూ. 120 కోట్లు. 2017 నుంచి 2018లో రూ. 208 కోట్ల రూపాయల మేర బడ్జెట్ నుంచి నిధులను విడుదల చేసింది.   
    
నిబంధనలు జన్తానై:
రూ.25లక్షలు అంతకు మించి విలువైన టెండర్లకు తప్పనిసరిగా దినపత్రికల్లో ప్రకటన ఇవ్వాలి. టెండర్‌కు సంబంధించిన ప్రకటన రెండు జాతీయ దినపత్రికల్లో ఇవ్వాలి. దీనిని ఎక్కడా పాటించలేదు. ఇఎస్‌ఐ పరిధిలోని ఆస్పత్రులకు వస్తువులు, మందులు, మిషనరీలు అత్యవసరం ఉన్నప్పుడు నిపుణుల సలహా మేరకు కొనుగోలు చేయాలి.

ఇక్కడ అలాంటివి పాటించకుండా తమ అబ్బసొత్తులా ఇష్టం వచ్చినట్లు కొనుగోలు చేశారు. వివిధ డిస్పెన్సరీలు, జాయింట్ డైరక్టర్లు, మెడికల్ సూపరింటెండ్‌ ల నుంచి ఇండెంట్లు తీసుకుని మందులకు ఆర్డర్ ఇవ్వాల్సి ఉండగా.. ఇఎస్‌ఐ డైరక్టర్ వారి వద్ద నుంచి ఎలాంటి ఇండెంట్ తీసుకోకుండానే కొనుగోళ్లు చేసారు.

డిస్పెన్సరీలు, ఆస్పత్రులకు సరఫరా చేసే డ్రగ్స్, సర్జికల్ ఐటమ్స్‌ ను ప్రొక్యూర్‌ మెంట్ కమిటీ సిఫార్సుల మేరకు కొనుగోలు చేసి పంపిణీ చేయాలి. కనీసం కమిటీని ఎక్కడ పరిగణలోకి తీసుకోలేదు. ఓపెన్ టెండర్ విధానాన్ని పాటించలేదు.

ఫార్మసిస్ట్ నాగలక్ష్మితోపాటు తేజాఫార్మా ఎండీ రాజేశ్వర్‌రెడ్డి, అతని తమ్ముడు శ్రీనివాస్‌రెడ్డిని రెండురోజుల కస్టడీలోకి తీసుకున్నారు. వారిని చంచల్‌గూడ జైలు నుంచి బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి తరలించి ప్రశ్నించారు. ఈ స్కాంలో ఇప్పటికే ఐఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ దేవికారాణి, జేడీ డాక్టర్ పద్మ, ఓమ్ని మెడి సంస్థ ఎండీ శ్రీహరిబాబు అలియాస్ బాబ్జీతోపాటు ఆ సంస్థ ప్రతినిధి నాగరాజును కస్టడీలోకి తీసుకొని పలు కీలక వివరాలు ఏసీబీ అధికారులు సేకరించారు.

వారిచ్చిన సమాచారంతో నాగలక్ష్మిని, రాజేశ్వర్‌రెడ్డిని, శ్రీనివాస్‌రెడ్డిని విడివిడిగా ప్రశ్నించి మరింత సమాచారాన్ని రాబట్టారు. ఈ ముగ్గురు నిందితులను శుక్రవారం ప్రశ్నించారు. ఈ స్కాంలో అక్రమంగా వివిధ ఖాతాల్లోకి వందల కోట్ల రూపాయలు మళ్లించినట్టు ఆధారాలు లభించాయి.

దీంతో ఈ కేసు గురించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ఆరాతీస్తోంది. ఈ స్కాంకు సంబంధించిన పలు కీలక పత్రాలను ఏసీబీ నుంచి ఈడీ అధికారులు సేకరించారు.