ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 3 డిశెంబరు 2019 (10:29 IST)

ఖాకీలకు ముచ్చెమటలు పోయించిన యువతి వచ్చేసింది..

ఆరు రోజులుగా పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన యువతి సురక్షితంగా నగరానికి చేరుకుంది. తనను వేధిస్తున్నాడని చెప్పిన యువకుడితోనే ఆమె వెళ్లిపోయింది. యువకుడి వేధింపులు తట్టుకోలేకపోతున్నానని, చచ్చిపోవాలని ఉందంటూ తండ్రికి ఫోన్‌చేసి వాపోయిన మరుసటి రోజే ఆమె అదృశ్యమైన విషయం విదితమే. 
 
అయితే వెళ్లే ముందు తాను ట్యాంక్‌బండ్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నా... నా శవాన్ని తీసుకెళ్లాలంటూ తండ్రికి సూసైడ్‌ నోట్‌ రాసి తాను ఆశ్రయం పొందుతున్న హాస్టల్‌లోని బెడ్‌పైన పెట్టేసి వెళ్లింది. అంతేకాదు! తన స్నేహితుడికి ట్యాంక్‌ బండ్‌పై నుంచి వాట్సాప్‌ వీడియోకాల్‌ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నా! చూడంటూ మాట్లాడింది. ఆ తర్వాత నుంచి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసింది.
 
ఈ విషయాన్ని యువతి కుటుంబసభ్యులు పోలీసుల దృష్టికి తీసుకురావడంతో నాటి నుంచి ఆరు రోజులపాటు పోలీసులు తీవ్ర హైరానాకు గురయ్యారు. తనను వేధిస్తున్నాడని యువతి చెప్పిన యువకుడు బేగంపేట్‌లో ఉంటున్న నేపథ్యంలో అతడి ఇంటి వరకు ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తూనే ఉన్నారు. 
 
కాగా ట్యాంక్ బండ్‌ నుంచి నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో కనిపించడంతో వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. చివరికి యువతిని వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడి సెల్‌ఫోన్‌ టవర్‌ లొకేషన్‌ ఏపీలోని గుంటూరులో ఉన్నట్లు చూపించడంతో అతడితోనే వెళ్లిపోయి ఉంటుందని భావించిన పోలీసులు వెంటనే ఓ బృందాన్ని గుంటూరుకు పంపించారు. 
 
ఆదివారం మధ్యాహ్నం వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సోమవారం నగరానికి తీసుకొచ్చారు. తమ గ్రామానికే చెందిన యువకుడితో తనకు స్నేహం ఉందని, ఆ చనువును ఆసరాగా చేసుకుని తనను ప్రేమ పేరుతో వేధిస్తుండడంతో కొన్ని నెలలుగా అతడితో మాట్లాడడం మానేసానని పోలీసులకు తెలిపింది. 
 
తన మాట వినని పక్షంలో గతంలో ఇద్దరం కలిసి దిగిన ఫొటోలను బయటపెడతానంటూ బ్లాక్‌మెయిల్‌ చేయడంతో అతడు చెప్పినట్లు చేశానని ఆమె పేర్కొంది. కాగా పోలీసులు ఇరువురిని విచారిస్తున్నారు. యువతి చెప్పిన విషయాలు నిజమని తేలితే యువకుడిపై కిడ్నాప్‌ కేసు నమోదుచేసి అరెస్టు చేసే అవకాశముంది.