బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : ఆదివారం, 8 మార్చి 2020 (12:16 IST)

విదేశాల నుంచి వస్తే.. 14 రోజులు ఇంట్లోనే..ఎక్కడ?

కరోనా (కొవిడ్‌-19) నియంత్రణ విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. విదేశాల నుంచి వచ్చే వారు వ్యాధి లక్షణాలు లేకున్నా, 14 రోజుల పాటు ఇంటి వద్దే ఉండాలని ఆదేశించింది.

ఆ తర్వాత పరీక్షలు చేశాకే వారు బయటకు రావాల్సి ఉంటుంది. ఈ దిశగా వైద్య ఆరోగ్య శాఖను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. వైరస్‌ సోకినా 14 రోజుల తర్వాతే వ్యాధి లక్షణాలు బయటపడతాయన్న అంచనాతో విదేశాల నుంచి వచ్చే వారు 14 రోజుల పాటు ఇంటి వద్దే ఉండాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది.

అనుమానితుల చికిత్సలోనూ మార్పులు చేస్తున్నారు. విదేశాల నుంచి వ్యాధి లక్షణాలతో వచ్చిన వారిని, ఎలాంటి లక్షణాలు లేని వారిని వేర్వేరు చోట్ల ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశించారు.

కేసులు లేవని తేలిగ్గా తీసుకోవద్దు రాష్ట్రంలో కేసులు లేవని తేలిగ్గా తీసుకోవద్దని, అప్రమత్తంగానే ఉండాలని మంత్రి ఈటల వైద్యాధికారులను కోరారు. ఆయన శనివారం పరిస్థితిని సమీక్షించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో కూడా మాట్లాడారు.

గాంధీ ఆసుపత్రిలోని ఏడో అంతస్తులో ఉన్న కరోనా వార్డుల్లోకి ఇతరులను అనుమతించవద్దని సూచించారు. బాధితుల్లో ఐటీ ఉద్యోగులు, ప్రముఖ బాధ్యతలు కలిగిన వారు ఉంటున్నందున వారి పనులకు ఇబ్బంది లేకుండా అవసరమైతే వైఫై సౌకర్యం కల్పించాలని సూచించారు.

వైద్యశాఖలోని అన్ని స్థాయుల అధికారులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.