ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 మార్చి 2024 (16:51 IST)

గాల్లో ఉండగా విమానం నుంచి ఊడిపడిన టైరు.. వీడియో వైరల్

flight tire
అమెరికాలో దేశంలో పెను ప్రమాదం తప్పింది. ఓ విమానం గాల్లో ఉండగా విమానం నుంచి ఓ టైరు ఊడిపోయి కిందపడింది. దీన్ని గమనించిన పైలెట్లు అప్రమత్తమైన ఆ విమానాన్ని అత్యవసరంగా కిందికి దించేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
యునైటెడ్ ఎయిర్ లైన్స్‌కు చెందిన బోయింగ్ 777-200 విమానం గురువారం ఉదయం (అమెరికా కాలమానం ప్రకారం) శాన్‌ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జపాన్‌లోని ఒసాకా నగరానికి బయలుదేరింది. అయితే, ఈ విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే వెనుక వైపున ల్యాండింగ్ గేర్‌లోని ఓ టైరు ఊడిపోయి కిందపడింది. అది విమానాశ్రయంలోని పార్కింగ్ లాట్లో ఉన్న కారుపై బలంగా పడటంతో వాహనం తీవ్రంగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
 
విమానం వెనుక చక్రాల్లో ఉన్న ఓ టైరు ఊడిపోయిన విషయాన్ని గుర్తించిన పైలెట్లు.. వెంటనే విమానాన్ని దారిమళ్లించి లాస్ఏంజిల్స్ ఎయిర్ పోర్టులోనే అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. దీంతో ఆ విమానంలోని ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత ఆ ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి పంపించినట్టు ఎయిర్‌పోర్టు వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటన సమయంలో విమానంలో 235 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది అందులో ఉన్నారు. 
 
బోయింగ్ 777 విమానాల్లో రెండు ల్యాండింగ్ గేర్లకు ఆరు చొప్పున టైర్లు ఉంటాయి. చక్రాలు ఊడినా, డ్యామేజ్ అయినా విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా ఈ మోడల్ డిజైన్ చేశారు. తాజా ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.