ఇక 17 ఏళ్ల అమ్మాయిలకు సై.. సౌదీలో డ్రైవింగ్ పర్మిట్.. కండిషన్స్ తప్పవ్!
మహిళల కోసం సౌదీ కొన్ని చట్టాలను అమలులోకి తెచ్చింది. ఇందులో 2017 సెప్టెంబర్‌లో మహిళలకు డ్రైవింగ్ చేసే వెసులుబాటు కల్పిస్తూ ప్రత్యేక చట్టాన్ని సౌదీ తీసుకువచ్చింది. ప్రస్తుతం 17 ఏళ్లు నిండిన యువతులకు కూడా డ్రైవింగ్ పర్మిట్ ఇవ్వనున్నట్లు చట్టం చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
17 ఏళ్లు నిండిన యువతులు డ్రైవింగ్ పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సౌదీ సర్కార్ ప్రకటించింది. ఈ తాత్కాలిక డ్రైవింగ్ పర్మిట్ కోసం దరఖాస్తు సమయంలో యువతులకు మెడికల్ చెకప్ ఉంటుందని పేర్కొంది. దరఖాస్తుదారులు సౌదీయేతరులు అయితే రెసిడెన్సీ పర్మిట్ తప్పనిసరి. డ్రైవింగ్ స్కూళ్లలో నిర్వహించే థియేరిటికల్ టెస్టు పాస్ కావాలి. ఈ షరుతులతో కూడిన డ్రైవింగ్ లైసెన్సును ఇవ్వడానికి సౌదీ అరేబియా చర్యలు తీసుకుంటోంది.
డ్రైవింగ్ స్కూళ్లలో ఆరు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఏడాది పాటు ఈ డ్రైవింగ్ పర్మిట్ చెల్లుబాటు అవుతుందని, 18 ఏళ్లు నిండిన తర్వాత ఈ డ్రైవింగ్ పర్మిట్‌నే డ్రైవింగ్ లైసెన్స్‌గా మార్చుకోవచ్చని సౌదీ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది.
అయితే, డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే యువతులకు కొన్ని ప్రత్యేక షరతులు విధించింది. డ్రైవింగ్ లైసెన్స్ కావాలని దరఖాస్తు చేసుకునేవారిపై డ్రగ్స్‌కు సంబంధించి ఎలాంటి కేసులు ఉండకూడదు. డ్రైవింగ్‌కు ఇబ్బంది కలిగించే ఆరోగ్య సమస్యలు ఉండరాదు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి జరిమానాలు ఉంటే.. వాటిని క్లియర్ చేసుకోవాల్సి వుంటుంది.