శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 28 మే 2021 (19:20 IST)

అబార్షన్ చేయించుకోవాలని కోవిడ్ సోకిన గర్భిణీలకు ఎందుకు చెబుతున్నారు?

కాజల్ (పేరు మార్చాం) గత ఏడు సంవత్సరాల నుంచి పిల్లల్ని కనాలని అనుకుంటున్నారు. ఇప్పుడామె గర్భం దాల్చారు. కానీ అబార్షన్ చేయించుకోమని ఆమెకు డాక్టర్ సూచించారు. ఆమెకు కోవిడ్ సోకడంతో డాక్టరు ఈ సలహా ఇచ్చారు. "నాకు కోవిడ్ సోకింది. కానీ నేనిప్పుడు బాగానే ఉన్నాను. మందులు వాడాను. నాకిప్పుడు కోవిడ్ లక్షణాలు లేవు" అని కాజల్ చెప్పారు. కానీ ఆమె వాడిన మందులు చూసిన తర్వాత అబార్షన్ చేయించుకోవడమే మంచిదని డాక్టర్ ఆమెకు చెప్పారు.

 
గర్భవతిగా ఉన్న సమయంలో వాడకూడని చాలా మందులను కాజల్ వాడటంతో డాక్టర్ ఆమెను గర్భస్రావం చేయించుకోమని చెప్పారు. "అబార్షన్ చేయించుకోమని నేను ఆమెకు చెప్పాను. అలా చెప్పగానే ఆమె ఏడవడం మొదలుపెట్టారు. కానీ ఆమెతో, ఆమె భర్తతో చాలాసేపు మాట్లాడిన తర్వాత వారు అంగీకరించారు" అని డాక్టర్ నివేదిత పవార్ చెప్పారు. "ఇలాంటి పరిస్థితే మరో వ్యక్తికి కూడా వచ్చింది. సమస్యను అర్థం చేసుకున్నానని ఆమె చెప్పారు. కానీ గర్భస్రావం చేయించుకోవడానికి ఆమె తిరిగి రాలేదు" అని అన్నారు. తొలి వేవ్ కోవిడ్ కంటే సెకండ్ వేవ్‌లో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ వేవ్‌లో చాలామంది తమ ప్రాణాలు కోల్పోయారు.

 
కొంతమంది అప్పుడే పుట్టిన బిడ్డలను కూడా కోల్పోయారు. ఎందుకని? 
కోవిడ్ చికిత్సలో భాగంగా ఇచ్చిన మందులు బిడ్డకు సురక్షితం కాదు. అవి కడుపులో ఉన్న బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపిస్తాయి. గర్భవతులకు కోవిడ్ సోకితే దాని వల్ల చాలా దుష్ప్రభావాలు కలగవచ్చు. "చాలా మంది గర్భిణీలు కరోనా సోకిన విషయాన్ని తమ డాక్టర్లకు చెప్పరు. డాక్టర్లు కూడా ఈ విషయం తెలియక ప్రతికూల ప్రభావాల గురించి ఆలోచించకుండా మందులు రాస్తారు. ఈ మందులు వాడిన మహిళలకు గర్భస్రావం చేయించుకోమని మేము సలహా ఇస్తున్నాం. నేను కొంత మందికి అబార్షన్ చేశాను. కానీ ఇది గర్భం దాల్చిన తొలినాళ్లలో అయితేనే వీలవుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉంది" అని డాక్టర్ నివేదిత పవార్ అన్నారు.

 
గర్భం దాల్చిన తొలి 3 నెలల సమయాన్ని ఆర్గానో జెనెసిస్ అని పిలుస్తారు. అదే సమయంలో పిల్లల అవయవాలు రూపొందుతాయి. ఆ సమయంలో రకరకాల ఔషధాలు వాడితే అవి పిల్లల అవయవాల అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. కొన్నిసార్లు గుండె బలహీనంగా మారవచ్చు లేదా కాళ్లు, చేతులు సరిగ్గా ఎదగకపోవచ్చు. "అందరూ కరోనాను మొదటిసారి చూస్తున్నారు. దీని గురించి శాస్త్రీయ సమాచారం లభించడానికి కనీసం 1 లేదా 2 సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు ఈ మందులు కడుపులో ఉన్న బిడ్డపై ఎలాంటి దుష్ప్రభావం చూపిస్తాయో చెప్పలేం" అని డాక్టర్ నివేదిత పవార్ అన్నారు.

 
"కానీ కరోనా చికిత్సలో వాడే ఫ్యాబి ఫ్లూ లాంటి మందులు పిండానికి చాలా హానికరం. ఈ మందులు వాడిన వారికి గర్భస్రావం చేయించుకోమనే చెబుతాం". "రెండవ దశకు చేరిన గర్భవతులకు అబార్షన్ చేయించుకునే అవకాశం ఉండదు. అలాంటి కేసుల్లో మేము ముప్పు ఉన్నప్పటికీ గర్భం కొనసాగించమనే సూచిస్తున్నాం" అని అన్నారు. ఈ మందులు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో కాలం మాత్రమే చెప్పగలదు. 20 నుంచి 30 లోపు వయసు ఉన్న మహిళలకు గర్భస్రావం చేయించుకోమని చెప్పవచ్చు. వారు గర్భం దాల్చేందుకు మరో అవకాశం తీసుకోవచ్చు. కానీ హార్మోన్ల సమస్యలతో బాధపడేవారు, వయసు మళ్లిన వాళ్లు, చాలా సంవత్సరాల తర్వాత గర్భం దాల్చిన వారు మరింత కాలం వేచి ఉండలేకపోవచ్చు. అలాంటి వారు అబార్షన్ చేయించుకోలేరు.

 
9 నెలల పరీక్షా కాలం
"నేను ఏడో నెల గర్భిణీగా ఉండగా మా అమ్మగారు కరోనాతో మరణించారు. నాకు పుట్టిన బిడ్డ బరువు కేవలం కిలోన్నర మాత్రమే ఉంది. నేను గర్భం దాల్చినప్పటి నుంచి ఏదో ఒక సమస్య చుట్టుముడుతూనే ఉంది. "నేను సరైన పోషకాహారం తీసుకోలేదు. చాలా మానసిక ఒత్తిడికి గురయ్యాను. 8వ నెలలో నాకు కోవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయింది"

 
"కొంతమంది నెలసరి సమయంలో మరణించినట్లు, మరికొంత మందికి ఆసుపత్రిలో బెడ్ దొరకక మరణించినట్లు వార్తలు విన్నాం. నాకు కూడా అలాంటి పరిస్థితే ఎదురవుతుందేమోనని భయపడ్డాను. మేము కొన్నేళ్లుగా బిడ్డ కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడేమి చేయాలో అర్థం కావటం లేదు. మేము నిత్యం ఒత్తిడితో, భయంతో సతమతమవుతున్నాం" అని రేష్మా రనసుభే అనే మహిళ చెప్పారు. రేష్మా కోవిడ్ సమయంలో ఒక బిడ్డకు జన్మనిచ్చారు.

 
కాబోయే తల్లులందరూ గత ఒకటిన్నర సంవత్సరం నుంచి భయంతోనే గడుపుతున్నారు. పిల్లల్ని కనాలనుకునేవారు, వారికి చికిత్స చేసే గైనకాలజిస్టులు కూడా ఒత్తిడితోనే జీవిస్తున్నారు. "ఈ సమయంలో గర్భం దాల్చవద్దని మేము చాలా మందికి చెబుతున్నాం. గత సంవత్సరం కూడా ఇదే విషయం చెప్పాం. కానీ ఈ మహమ్మారి ఎప్పటికి అంతమవుతుందో తెలియడం లేదు అని డాక్టర్ పవార్ అన్నారు. ఐవీఎఫ్ కూడా ఆగిపోయింది. ఇప్పటికే 35-37 సంవత్సరాలు వచ్చిన వారు మరింత కాలం ఆగలేరు. అలాంటి వాళ్ళని ఆగమని ఎలా చెప్పగలం? మేము వీలైనంత శ్రద్ధ తీసుకుంటాం. కొంతమందికి సలహాలు ఇస్తాం. ఈ సమయంలో గర్భం దాల్చడం మాత్రం చాలా కష్టమైన విషయం" అని డాక్టర్ పవార్ చెప్పారు.

 
"మేము చికిత్స చేస్తున్నాం. కానీ, తల్లి ప్రాణాలకు ఎంత ముప్పు ఉంటుందో చెప్పలేం. పిల్లల్లో ఏవైనా లోపాలు ఏర్పడతాయో కూడా చెప్పలేం. రోగికి చికిత్స చేస్తూ ఉండగా మాకు కూడా ఇన్ఫెక్షన్ సోకుతుందేమోననే భయంతో ఉంటాం" అని అన్నారు. కోవిడ్ సమయంలో ఈ తొమ్మిది నెలలు దాటడం సదరు మహిళకు, ఆమె కుటుంబానికి ఒక పరీక్షా కాలంలా ఉంటుంది.

 
నేను నా బిడ్డను దూరంగా ఎలా ఉంచగలను?
నాసిక్‌కి చెందిన జుబియా షేక్ కొన్ని నెలల క్రితం ఒక బిడ్డకు జన్మనిచ్చారు. అప్పటి వరకు ఆమెకు కోవిడ్ సోకలేదు. కానీ ప్రసవం తర్వాత బిడ్డకు మసాజ్ చేయడానికి వచ్చిన అమ్మాయి ద్వారా ఆమెకు ఇన్ఫెక్షన్ సోకింది. ఆ తర్వాత బిడ్డకు పాలివ్వడం ఎలా అనే ప్రశ్న ఆమెను బాధించింది. బిడ్డను నా నుంచి దూరంగా ఉంచి బయటి పాలు పట్టమని డాక్టర్ చెప్పారు. కానీ, నా బిడ్డను దూరంగా ఎలా ఉంచాలో అర్థం కాలేదు.

 
నేను రెండు మాస్కులు ధరించి బిడ్డకు పాలిచ్చాను. ఆ తర్వాత బిడ్డను ఇంట్లోవాళ్లకి ఇచ్చేస్తూ ఉండేదానిని. అదృష్టవశాత్తూ నాకు ఇన్ఫెక్షన్ తీవ్రంగా సోకకపోవడం వల్ల త్వరగా కోలుకున్నాను. నా వల్ల బిడ్డకు ఏమైనా అవుతుందేమోనని భయపడుతూ ఉండేదానిని అని జుబియా షేక్ చెప్పారు.

 
నిలిచిపోయిన ఐవీఎఫ్ చికిత్సలు
సహజంగా పిల్లల్ని కనలేని దంపతులు ఐవీఎఫ్ చికిత్స ద్వారా పిల్లల్ని కనాలని అనుకుంటారు. కానీ కరోనా సమయంలో ఈ చికిత్స చేయడం తగ్గిపోయింది. దాంతో చాలా మంది దంపతులు తమ ఆశలు కోల్పోయారు. రచన (పేరు మార్చాం) ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. "మాకిదే ఆఖరి అవకాశం. అది కూడా పోయింది" అని రచన చెప్పారు. "లాక్‌డౌన్ సమయంలో ఐవీఎఫ్ చికిత్సలు పూర్తిగా ఆగిపోయాయి. ఐవీఎఫ్ చికిత్సలు ఆపమని ప్రపంచవ్యాప్తంగా పిలుపునిచ్చారు" అని ది ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజిస్ట్ సొసైటీస్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షురాలు డాక్టర్ నందిని పల్షేట్కర్ చెప్పారు.

 
"ఆలస్యంగా వివాహాలు జరిగి కేవలం ఐవీఎఫ్ ద్వారా మాత్రమే పిల్లల్ని కనే అవకాశం ఉన్న మహిళలు మరో రెండు మూడేళ్లు ఆగలేరు. లాక్‌డౌన్‌తో పాటు ఆదాయాలు పడిపోవడం కూడా ఐవీఎఫ్ చికిత్సలు నిలిచిపోవడానికి ఒక కారణం. ఆర్థిక వ్యవస్థ మందగించింది. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. దాంతో చాలా మంది చికిత్సకయ్యే ఖర్చును భరించలేకపోయారు. ఇదంతా ఐవీఎఫ్‌పై ప్రభావం చూపించింది" అని నందిని చెప్పారు.

 
ఆశను కోల్పోకండి
పరిస్థితులు విచారకరంగా ఉన్నప్పటికీ ఆశను కోల్పోవాల్సిన పని లేదని డాక్టర్ పల్ షేట్కర్ చెబుతున్నారు. దీనికి ఆందోళన చెందాల్సిన పని లేదు. సానుకూల దృక్పథంతో ఉండమని నేను మహిళలకు సలహా ఇస్తాను" అని అన్నారు. "జికా వైరస్ వచ్చినప్పుడు కూడా గర్భిణీలకు అబార్షన్ చేయించుకోమని చెప్పారు. కానీ కరోనావైరస్ విషయంలో ఇంకా అలాంటి సూచనలు రాలేదు" అని ఆమె చెప్పారు.

 
"కోవిడ్ సమయంలో హాని చేయని కొన్ని మందులను ఇవ్వవచ్చు. నేనింకా నా దగ్గరకు వచ్చే వారిని అబార్షన్ చేయించుకోమని చెప్పలేదు కానీ గర్భవతులకు కోవిడ్ సోకితే ప్రమాదకరంగా మారవచ్చని అమెరికాలో ఒక అధ్యయనం తెలిపినట్లు ఆమె చెప్పారు. "వ్యాక్సినేషన్‌లో గర్భిణీలకు ప్రాధాన్యత ఇవ్వాలని, టీకాలు తీసుకోవడం వల్ల ఎలాంటి హాని లేదు" అని కొన్ని అధ్యయనాలు నిరూపించినట్లు చెప్పారు.

 
దేశంలో వ్యాక్సీన్ల కొరత ఉన్నప్పుడు గర్భిణీలకు టీకాలు ఎలా లభిస్తాయి?
కోవిడ్ సోకిన మహిళలకు తొమ్మిది నెలలు నిండకుండానే ప్రసవం అయిపోతున్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఇదే విషయాన్ని యూకేలో జరిగిన ఒక అధ్యయనం కూడా చెప్పింది. "38 వారాల కంటే ముందుగా బిడ్డ పుడితే దానిని ప్రీ మెచ్యూర్ డెలివెరీ అంటారు. జ్వరం లాంటివి వచ్చినా కూడా నెలలు నిండకుండానే పిల్లలు పుట్టే అవకాశం ఉంది. లేదా గర్భస్రావం జరగవచ్చు. కోవిడ్ సోకిన తర్వాత జ్వరం వస్తే అది పరిస్థితిని మరింత కష్టతరం చేస్తుంది" అని డాక్టర్ పల్ షేట్కర్ చెబుతున్నారు. కానీ భయపడకుండా సరైన చికిత్స తీసుకోమని ఆమె సూచిస్తున్నారు.