గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 మే 2021 (18:00 IST)

జూడాల సమ్మె : సీనియర్ రెసిడెంట్లకు సీఎం కేసీఆర్ శుభవార్త

తమ డిమాండ్ల పరిష్కారం కోసం జూనియర్ డాక్టర్లు (జూడా) సమ్మెకు దిగారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సమ్మెకు పిలుపునివ్వడం మంచిది కాదని, ఇటువంటి కీలక సమయంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని తక్షణమే విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి కేసీఆర్ జూనియర్ డాక్టర్లకు సూచించారు. 
 
ప్రభుత్వం, జూనియర్ డాక్టర్ల పట్ల ఏనాడూ వివక్ష చూపలేదని వారి సమస్యలను పరిష్కరిస్తూనే వున్నదని ఇప్పుడు కూడా న్యాయమైన కోరికలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు.  
 
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సీనియ‌ర్ రెసిడెంట్ డాక్ట‌ర్ల గౌర‌వ వేత‌నాన్ని రూ.70 వేల నుంచి రూ.80,500ల‌కు పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ది. పెరిగిన స్టైఫండ్ ఈ ఏడాది జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి అమ‌లు కానున్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. దీంతో రెసిడెంట్ డాక్ట‌ర్లు ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
 
అంతకుముందు జూనియర్ డాక్టర్ల విషయాన్ని వైద్యాధికారులు, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్యలపై సీఎం మాట్లాడుతూ.. జూనియర్ డాక్టర్లవి న్యాయమైన కోరికలు అయినపుడు, పరిష్కరించడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం వుండబోదు. వాటిని ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవచ్చు. 
 
అంతేకానీ, చీటికి మాటికి ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా, సమయాసందర్బాలను కూడా చూడకుండా, సమ్మె పేరుతో విధులను బహిష్కరించడం సరియైన పద్దతి కాదు. అదీకూడా, కరోనా వంటి అత్యవసర పరిస్థితుల్లో ఇటువంటి నిర్ణయాన్ని ప్రజలు హర్షించరు అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.