మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 మే 2021 (16:08 IST)

తెలంగాణలో మరో ఆనందయ్య : ఆ మందునే ఇస్తున్న రిటైర్డ్ సింగరేణి కార్మికుడు

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆనందయ్య కరోనా రోగులకు ఇచ్చే మందుపై కొన్ని వేల మంది ఎదురు చూస్తున్నారు. ఆనందయ్య మందు వ్యవహారం ఇపుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. 
 
అయితే, ఆనందయ్య మందుకు శాస్త్రీయత లేదని.. పూర్తి అధ్యయనం తర్వాత అనుమతులు ఇస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆయుర్వేద మందు పంపిణీ నిలిచిపోయింది. అయితే ఆనందయ్యలాగే మరికొందరు కూడా కరోనాకు మందు ఇస్తున్నారు. 
 
కృష్ణపట్నం తరహాలోనే రాజమండ్రిలోనూ ఓ వ్యక్తి మందును పంపిణీ చేశారు. కడప జిల్లా పులివెందులతో పాటు.. చిత్తూరు జిల్లాలో కూడా ఇద్దరు ఆనందయ్యలు ముందుకు వచ్చారు. ఇప్పుడు తెలంగాణలోనూ అలాంటి ముందునే ఇస్తున్నారు ఓ సింగరేణి రిటైర్డ్ కార్మికుడు.
 
రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా మందమర్రి మండల కేంద్రానికి చెందిన బచ్చలి భీమయ్య గతంలో సింగరేణిలో పనిచేశారు. ఆయన పూర్వీకులు ఆయుర్వేద మందులు తయారుచేసి స్థానికులు వైద్యం చేసేవారు. వారి నుంచి వైద్యం నేర్చుకున్న భీమయ్య.. ఇప్పుడు కరోనాకు కూడా మందు తయారుచేశారు. 
 
ఆనందయ్యకు తీసిపోని విధంగా కరోనా వచ్చిన వారికి ఉచితంగా వైద్యం చేస్తున్నారు. ఇప్పటివరకు చాలా మందికి నయం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. మాస్క్‌ కూడా ధరించకుడా.. కరోనా రోగులను పక్కన కూర్చోబెట్టుకొని, వారిలో ధైర్యాన్ని నింపుతున్నారని తెలిపారు. ఇప్పటికే 100 మందికి పైగా ఆయుర్వేద మందును ఇచ్చినట్లు సమాచారం.
 
కృష్ణపట్నం ఆనందయ్య వ్యవహారం వెలుగులోకి రావడంతో ఇపుడు బచ్చలి భీమయ్య వైద్యం కూడా సోషల్ మీడియాలో వైరలైంది. రోజు రోజుకూ ఆయన వద్దకు వచ్చే వారి సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో మందమర్రి పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకొని, విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 
 
ఎలాంటి అనుమతులు లేకుండానే ఏ విధంగా మందును పంపిణీ చేస్తున్నారంటూ ఆరా తీస్తున్నారు. మందును ఇవ్వకూడదని స్పష్టం చేశారు. కానీ, భీమయ్య మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వం అనుమతిస్తే కరోనా పేషెంట్లకు ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తానని భీమయ్య కూడా చెబుతున్నారు.