ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 జులై 2021 (15:29 IST)

కొత్త ప్రైవసీ పాలసీపై వాట్సాప్ వెనుకడుగు... ఢిల్లీ కోర్టు షాక్

కొత్త ప్రైవసీ పాలసీపై వాట్సాప్ వెనుకడుగు వేసింది. డేటా ప్రొటెక్షన్ బిల్లు అమల్లోకి వచ్చే వరకు ఈ వివాదాస్పద విధానాన్ని స్వచ్ఛందంగా నిలిపేస్తామని ఢిల్లీ హైకోర్టుకు శుక్రవారం తెలిపింది. ఈ విధానాన్ని అంగీకరించని యూజర్లకు అందజేసే సేవల్లో ఎటువంటి పరిమితులను విధించబోమని చెప్పింది.
 
వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీపై దర్యాప్తునకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ దర్యాప్తును నిలిపేసేందుకు సింగిల్ జడ్జి బెంచ్ తిరస్కరించడంతో ఫేస్‌బుక్, వాట్సాప్ అపీలు చేశాయి. 
 
ఈ అపీలుపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్ ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ విచారణ సందర్భంగా వాట్సాప్ శుక్రవారం సమర్పించిన వాదనల్లో డేటా ప్రొటెక్షన్ బిల్లు అమల్లోకి వచ్చే వరకు తన కొత్త ప్రైవసీ పాలసీని నిలిపివేయనున్నట్లు తెలిపింది.
 
వాట్సాప్ తరపున సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే వాదనలు వినిపిస్తూ, తమ కొత్త ప్రైవసీ పాలసీని స్వచ్ఛందంగా నిలిపేయడానికి అంగీకరిస్తున్నామని చెప్పారు. యూజర్లు ఈ విధానాన్ని యాక్సెప్ట్ చేయాలని నిర్బంధించబోమని తెలిపారు. అయితే యూజర్లకు అప్‌డేట్‌ను డిస్‌ప్లే చేయడం కొనసాగిస్తామన్నారు.
 
వాట్సాప్ తన ప్రైవసీ పాలసీని ఈ ఏడాది జనవరిలో అప్‌డేట్ చేసింది. యూజర్లు జరిపే సంభాషణలు, ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన సమాచారాన్ని తన మాతృ సంస్థ అయిన ఫేస్‌బుక్‌తో పంచుకునేందుకు ఈ కొత్త విధానం అనుమతి ఇస్తుంది. 
 
ఈ విధానాన్ని అంగీకరించని యూజర్లకు సేవలను పరిమితం చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో వాట్సాప్ యూజర్లు తమ వ్యక్తిగత గోప్యత పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
 
విమర్శలు రావడంతో కాస్త వెనక్కు తగ్గిన వాట్సాప్ తన నిర్ణయం మారబోదని మళ్ళీ ఫిబ్రవరిలో ప్రకటించింది. ఈ ఆలోచనలను మానుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరినప్పటికీ వాట్సాప్‌ ఈ ప్రకటన చేసింది. సేకరించే 'సున్నితమైన వ్యక్తిగత' సమాచారం గురించి, ఆ సమాచారాన్ని ఎవరితో పంచుకుంటారనే విషయం గురించి ఈ కొత్త విధానం వివరించలేదని ప్రభుత్వం పేర్కొంది.