మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (14:22 IST)

వాట్సాప్‌లో న్యూఫీచర్.. ఇకపై గ్రూపు కాలింగ్ సదుపాయం?!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కష్టాలు నెలకొనివున్నాయి. ఈ వైరస్ బారినపడకుండా ఉండాలంటే సామాజిక భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో గతంలో మాదిరిగా గుంపులు, గుంపులుగా చేరి మాట్లాడుకునే వెసులుబాటు లేకుండా పోయింది. దీంతో ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ అయిన ట్విట్టర్ సరికొత్తగా అదిరిపోయే ఫీచర్‌ను తీసుకునిరానుంది. ఇందుకోసం గూగుల్ డ్యూ, జూమ్ యాప్‌ల సహాయం తీసుకోనుంది. 
 
నిజానికి వాట్సాప్ ఇప్పటికే అదిరిపోయే ఫీచర్లను తమ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. అలాగే, మున్ముందు కూడా మరికొన్ని ఫీచర్లు తెచ్చేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్ డెవలప్మెంట్స్ సాగుతోంది. ఈ నేపథ్యంలో గ్రూప్ కాలింగ్ కోసం సరికొత్త ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకునిరానుంది. 
 
ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఇకపై వాట్సప్ గ్రూప్‌ కాల్‌లో చాలా మంది ఒకేసారి మాట్లాడుకోవచ్చు. ఇప్పటివరకు వాట్సప్‌ గ్రూప్‌ కాల్‌లో కేవలం నలుగురు మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది. దీంతో చాలా మంది ఇతర యాప్‌లను వినియోగిస్తున్నారు. వాట్సప్‌ తమ గ్రూప్ కాల్‌ ఫీచర్‌లో పరిధిని పెంచుతూ నలుగురి కంటే ఎక్కువ మంది మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించేలా మార్పులు చేసింది. 
 
ఇప్పటికే జూమ్, గూగుల్‌ డుయో వంటి యాప్‌లు పదులకొద్దీ యూజర్లు ఒకేసారి గ్రూప్‌కాల్‌లో మాట్లాడుకునే అవకాశాలు ఇస్తున్నాయి. ఇప్పుడు ఇటువంటి ఫీచరునే తీసుకురావడానికి వాట్సప్‌ సిద్ధమైంది. ఇప్పటివరకు ఈ ఫీచర్‌ వాట్సప్‌ యాప్‌లో అప్‌డేట్‌ కాలేదు.
 
వాట్సప్ ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్‌ కనపడిందని, త్వరలోనే యూజర్లకు ఈ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి రానుందని 'వాబీటాఇన్ఫో' సంస్థ పేర్కొంది. అయితే, దీన్ని విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయని తెలిపింది. 
 
ఈ కొత్త ఫీచర్‌లో ఎంతమంది ఒకేసారి మాట్లాడుకోవచ్చన్న విషయంపై స్పష్టతరాలేదు. అయితే, వాట్సప్‌ కూడా పదుల సంఖ్యలో యూజర్లు గ్రూప్‌ కాల్‌లో పాల్గొనే అవకాశం ఇవ్వచ్చు.