ఈసీ పాత్రపై అనుమానాలు... సత్యమే గెలుస్తుంది : రాహుల్ గాంధీ
సార్వత్రిక ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లో జరిగిన అక్రమాల విషయంలో ఎన్నికల సంఘం పాత్రపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సందేహం వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, ఐదేళ్ళ కాలంలో ఒక్క విలేకరుల సమావేశాన్ని కూడా నిర్వహించని ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ముగింపు దశలో పెట్టడం ద్వారా తన స్వభావం ఏంటో మోడీ చాటుకున్నారని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా, ఈసీ కూడా పక్షపాత ధోరణితో వ్యవహరించిందని, ప్రధాని షెడ్యూల్‌కు అనుగుణంగా ఆదేశాలు జారీచేసిందని ఆరోపించారు.
'2014 ఎన్నికల అనంతరం మాకు పార్లమెంటులో తగినంత సంఖ్యాబలం లేకున్నా ప్రతిపక్షంగా సమర్థవంతమైన పాత్ర పోషించాం. అందుకు మేం సంతోషిస్తున్నాం. ప్రతిపక్షంగా మేం నిర్వర్తించిన పాత్రకు 'ఏ' గ్రేడ్ ఇచ్చుకుంటాం. ఈ ఐదేళ్లలో రాఫెల్ పైనే కాదు అనేక అంశాల్లో ప్రధానిని నిలదీశాను. ఆయనకు ఎన్నో ప్రశ్నాస్త్రాలు సంధించాను. ఎక్కడికైనా చర్చకు వచ్చేందుకు సిద్ధం అని చెప్పాను. ఒక్కదానికీ సమాధానం లేదు. చర్చకు పిలిస్తే ఆయన భయపడ్డారు. చౌకీదార్ చోర్ అని దేశ ప్రజలే అంటున్నారు.
రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందంలో అనిల్ అంబానీకి ప్రధాని రూ.30,000 కోట్ల మేర దోచిపెట్టింది నిజంకాదా? తప్పుచేయకపోతే ఆయన ఎందుకు బహిరంగ చర్చకు రావడంలేదు? ప్రజలే న్యాయనిర్ణేతలు, వాళ్లు ఏం నిర్ణయించారన్నది చెప్పడానికి నేనెవర్ని. ప్రజల తీర్పు ఎలా ఉంటుందన్నది మే 23న తేలుతుంది. మోడీ నన్ను దూషించడంపై నాకేమీ బాధలేదు. నన్ను తిట్టడం పట్ల ఆయన సంతోషంగా ఫీలైతే అది ఆయనకే వదిలేస్తాను. నా వరకు ఎలా స్పందించాలన్న విషయాన్నే పరిగణనలోకి తీసుకుంటాను తప్ప మోడీనో, మాయావతో దూషించడం పట్ల స్పందించబోను' అని వ్యాఖ్యానించారు.
ఇకపోతే, నరేంద్ర మోడీ, బీజేపీ వద్ద లెక్కలేనంత డబ్బు ఉన్నదని, వాళ్లు మార్కెటింగ్ కూడా ఎక్కువే చేశారన్నారు. మా కన్నా బీజేపీ ఎక్కువ ప్రచారం చేసిందని, అది సుమారు 1-20 శాతం తేడాతో ఉన్నదని, కానీ మా దగ్గర కేవలం సత్యం మాత్రమే ఉందని, సత్యమే విజయం సాధిస్తుందని రాహుల్ వేదాంత ధోరణితో వ్యాఖ్యానించారు. తమ వద్ద సత్యం మాత్రమే ఉందని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా చివరకు సత్యమే గెలుస్తుందన్నారు.