సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : శుక్రవారం, 17 మే 2019 (13:09 IST)

ప్రధానమంత్రి రేసు : తెరపై ఇద్దరు మహిళలు.. తెరవెనుక ఇద్దరు చంద్రులు!!

ఇద్దరు చంద్రుల పాలనలో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు మాత్రం చల్లగా లేవు. ఇద్దరు చంద్రుల కన్ను ఒక్కసారిగా జాతీయ రాజకీయాలపై పడడంతో ప్రాధాన్యం పెరిగింది. మే 23వ తేదీ తర్వాత రూపుదిద్దుకోబోతున్న జాతీయ రాజకీయాల ఉహా చిత్రాన్ని ఇప్పుడు హైదరాబాద్, అమరావతి రాజధాని నగరాల్లో చూడవచ్చు.
 
ఈసారి ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అన్నింటా ముందస్తు విధానాలను అనుసరిస్తున్నారు. సచివాలయానికి రావడం లేదనే విమర్శ ఆయనపై ఉన్నప్పటికీ ఆ తీరిక సమయాన్ని కేసీఆర్ రాజకీయ వ్యూహాలను రచించడానికి సద్వినియోగం చేసుకుంటున్నారు.
 
తెలంగాణలో జమిలి ఎన్నికలు జరిగితే జాతీయ రాజకీయాల ప్రాధాన్యం పెరిగిపోతుందని ముందుగా గ్రహించింది ఆయనే. తాను ప్రధానంగా ఆధారపడుతున్న తెలంగాణ సెంటిమెంట్ దెబ్బతింటుందని వారు సరిగ్గానే అంచనా వేశారు. సంక్షేమం వెలుగులపై జాతీయ రాజకీయాల నీడ పడుతుందని కూడా అంచనావేశారు. ఐదు నెలలు ముందుగానే అసెంబ్లీ ఎన్నికలు జరిపించేసి గెలిచి ఒడ్డున కూర్చున్నారు.
 
కేసీఆర్ ది సేఫ్ గేమ్. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో ఆశించినన్ని సీట్లు వచ్చినా రాకున్నా ఆయనకు పోయేదేమీలేదు. వాళ్లు అంచనా వేస్తున్నదానికి కాస్త అటూ ఇటూ వచ్చినా జాతీయ రాజకీయాల్లోనూ వారు ఓ మెరుపు మెరిసే అవకాశాలున్నాయి. జాతీయ రాజకీయాల సన్నివేశమే ఇపుడలా మారిపోయింది. దేవెగౌడ నాటి రోజులు ఊరిస్తున్నాయి. వారు దాని మీదే దృష్టి పెట్టి పావులు కదుపుతున్నారు.
 
ఏడాది కిందటే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ నినాదాన్ని అందుకున్నారు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల ప్రభుత్వం ఏర్పడాలనేది ఈ ఫ్రంట్ ఉద్దేశం. అప్పట్లో ఒడిశా వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను, పశ్చిమ బెంగాల్ వెళ్లి దీదీ మమతా బెనర్జీనీ కలిసి వచ్చారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ వచ్చి కేసిఆర్‌ను కలిసివెళ్లారు.
 
అయితే, ఫెడరల్ ఫ్రంట్ నినాదాన్ని కాంగ్రెస్ శిబిరం విమర్శనాత్మక దృష్టితో చూసింది. దాన్ని నరేంద్ర మోడీ 'బి' టీమ్ అంటూ తీసిపడేసింది. తెలంగాణ రాష్ట్ర సమితి వాదన మరోలా వుంది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల సాధనకు ఢిల్లీలో ఉనికి చాటుకోవాల్సిన అవసరం ఉందని ఆ పార్టి ముఖ్యులు చెబుతున్నారు.
 
ఈసారి లోక్‌సభ ఎన్నికల కోడ్ మరీ 75 రోజులకు పొడిగించారు. తొలి దశలోనే ఎన్నికలు ముగిసి పోవడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఫలితాల కోసం నెలన్నర సుదీర్ఘ కాలం ఎదురుచూడాల్సి వస్తోంది. కోడ్ అమల్లో ఉన్న కాలంలో ముఖ్యమంత్రులు ప్రభుత్వాన్ని నడపవచ్చా? లేదా? అనేది కూడ చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఈ అంశం ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిల మధ్య ముక్కోణ వివాదంగా కొనసాగుతోంది.
 
ఈ రాజకీయ విశ్రాంతి సమయాన్ని కేసీఆర్ సద్వినియోగం చేసుకునే ప్రయత్నాల్లో పడ్డారు. మళ్ళీ ఫెడరల్ ఫ్రంట్ నినాదాన్ని బయటికి తీశారు. కేరళ వెళ్లి ముఖ్యమంత్రి పినరయి విజయన్ కలిశారు. వారి తదుపరి ప్రయాణం చెన్నై. డీఎంకే అధినేత స్టాలిన్‌ను కలిసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాట్లపై చర్చించాలనుకున్నారు. ఆ తర్వాత దీదీ మమత బెనర్జీనీ, నవీన్ పట్నాయక్‌ను మరోసారి కలుస్తారని తెలంగాణ భవన్ వర్గాలు అంటున్నాయి.
 
కేసీఆర్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కలవడంలో ఇంకో ప్రత్యేకత ఉంది. ఆయన ఇంతవరకు ప్రాతీయ పార్టీల అధినేతల్నే కలుస్తూ వచ్చారు. కానీ, పినరయి విజయన్ జాతీయ పార్టి అయిన సీపీఎం నాయకుడు మాత్రమేకాదు స్పష్టంగా మోడీ వ్యతిరేక విధానాలు గల నేత. దీనినిబట్టి కేసిఆర్ చిన్న సైజు జాతీయ పార్టీల మీద కూడ కన్నేశారని భావించవచ్చు.
 
జాతీయ రాజకీయాల్లో చంద్రబాబుకు సుదీర్ఘ చరిత్ర వుంది. 1980వ దశాబ్దం చివర్లో ఆయన ఎల్.టి.రామారావు నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా మారి కాంగ్రెస్ సహకారంతో దేవెగౌడ, గుజ్రాల్‌లను ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. 1998లో ఎన్డీయే కన్వీనర్‌గా మారి ఢిల్లీలో చక్రం తిప్పి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధాని కావడంలో ప్రధాన పాత్ర పోషించారు. అప్పటి ఎన్డీయేలో చంద్రబాబు ప్రభావం చాలా బలంగా వుండేది. బాబు సూచనల మేరకే 2004లో వాజ్‌పేయి ముందస్తు ఎన్నికలకు సిధ్ధం అయ్యారని కూడా చెపుతారు.
 
గత యేడాది కేంద్ర బడ్జెట్ తర్వాత చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోడీతో బెడిసింది. మొదట్లో రాష్ట్రానికి నిధుల కేటాయింపు అంశాల్లో మొదలైన వివాదం క్రమంగా రాజకీయ విధానాల వరకు విస్తరించింది. మోడీ విధానాలను విమర్శించడంలో చంద్రబాబు జాతీయ నేతలు అందర్నీ మించిపోయారు. కర్ణాటక ఎన్నికల నుండే కాంగ్రెస్ పార్టీకి దగ్గరైన చంద్రబాబు ప్రస్తుతం యూపీఏ కూటమిలో అప్రకటిత కన్వీనర్ పాత్రను పోషిస్తున్నారు. 
 
సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ జరిగిన మరునాటి నుండే చంద్రబాబు ఈవీఎం వ్యతిరేక పోరాటాన్ని ఆరంభించారు. అది క్రమంగా జాతీయ ఆందోళనగా మారింది. అలా వారు మరోసారి ఢిల్లీ వేదికల మీద వెలుగులోనికి వచ్చారు.
 
ఇకపోతే, కాంగ్రెస్ పార్టీలో అగ్రనేతలు ఎక్కువ. అందువల్లే ఎన్నికలకు ముందు ప్రధాని అభ్యర్ధిని ప్రకటించే సాంప్రదాయాన్ని కాంగ్రెస్ పాటించడంలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే ప్రధాని అభ్యర్ధిని ఎంపిక చేస్తామని కాంగ్రెస్ రాకుమారుడైన రాహుల్ గాంధేయే తరచూ ప్రకటిస్తున్నారు. విపక్షాల్లో ఈసారి ప్రధాని పదవికి దీదీ మమతా బెనర్జీ, బెహన్ మాయావతి హోరాహోరీగా పోటీలో వున్నారు. రాహుల్ గాంధీ కూడా ప్రధాని పదవి కోసం ఇంకో ఎన్నికల వరకు ఆగాల్సి రావచ్చని మానసికంగా సిధ్ధమయ్యారని ఏఐసిసి వర్గాలు అంటున్నాయి.
 
రాజకీయాల్లో ఒక సాంప్రదాయం వుంది. పెద్ద కుర్చీ కోసం ఇద్దరు ప్రముఖులు తీవ్రంగా పోటీ పడితే పదవి మూడో వ్యక్తి పోతుంది. పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు అన్నమాట. గతంలో పీవీ నరసింహారావు అలానే ఏ ప్రయత్నమూ చేయకుండా ఇంట్లో కూర్చుంటే ప్రధాని పదవి వచ్చి ఒళ్ళో పడింది.
 
లోక్‌సభ సీట్లలో విపక్షాలకు ఆధిక్యం వచ్చి, మమత, మాయావతిల మధ్య రాజీ కుదరకపోతే, రాహుల్ గాంధీ పోటీకి బయట ఉండాలని నిర్ణయించుకుంటే కొత్త ప్రధాని పదవి కొత్త వారి ఒళ్లో పడడం ఖాయం. అలాంటి సందర్భం కోసం చంద్రబాబు ఎదురుచూస్తున్నారని టీడీపీ సన్నిహితుల అంచన. మరోవైపు సమీకరణాలు అటూ ఇటూ మారి ఫెడరల్ ఫ్రంట్లో పెద్ద పార్టీల మధ్య విభేదాలు తలెత్తితే డబుల్ డిజిట్‌కి కొంచెం అటూ ఇటూ ఉన్న పార్టీలకు కూడా పెద్ద అవకాశం రావచ్చని కేసీఆర్ కూడా అంచనా వేస్తున్నారు.
 
చంద్రబాబు మొదటి ప్రాధాన్యం రాష్ట్రమే అని తెలుగుదేశం వారు అంటున్నారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మీద టిడిపి శ్రేణుల్లో కలవరం కనపడుతోంది. వైసీపీ జగన్ అవకాశాలు పెరిగాయన్న ఆందోళన చాలామందిలో ఉంది.
 
"అసలు జగన్ 2014 ఎన్నికలలోనే గెలిచి ఉండేవారు. అప్పటి ఊపు అలానే ఉంది. అయితే కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి సమర్ధుడైన చంద్రబాబే తొలి ముఖ్యమంత్రి కావాలని జనం ఆలోచించారు. ఇప్పుడూ జనం అలాగే ఆలోచిస్తున్నారు. జగన్ జాతీయ రాజకీయాలకు పనికిరారు. దానికి చంద్రబాబే బెస్టు. అసెంబ్లీ సీట్లలో ఏదైనా తేడా వస్తే రావచ్చుగానీ, పార్లమెంట్ సీట్లలో ఆధిక్యత టిడిపితే" అని ఓ టిడిపి వ్యూహకర్త వివరించారు. వారి మాటలకు అర్థం ఏమంటే చంద్రబాబు ప్రధాని రేసులో వున్నారని ఇట్టే గ్రహింవచ్చు.
 
అటు తెలంగాణలోనూ కేసీఆర్ ప్రధాని రేసులో ఉన్నారనే మాట బలంగా వినిపిస్తోంది. విపక్షాల్లో కాంగ్రెస్, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ తర్వాత పట్టుమని పది లోక్‌సభ సీట్లున్న వాళ్ళు కూడా ప్రధాని రేసులో నిలవవచ్చు అని చాలామంది భావిస్తున్నారు.
 
స్వర్గీయ ఎన్టీ రామారావు నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్ 1989 ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ఆధిక్యతను సాధించి వీపీ సింగ్ ప్రధానిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపి ఓడిపోయి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. చరిత్ర పునరావృతం అవుతుందా? ఏమో!