శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : సోమవారం, 6 మే 2019 (12:20 IST)

వెస్ట్ బెంగాల్ హింసాత్మకం : బీజేపీ అభ్యర్థిని చితకబాదిన టీఎంసీ కేడర్

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఐదో దశ పోలింగ్ సోమవారం జరుగుతోంది. మొత్తం 7 రాష్ట్రాల్లో 61 నియోజకవర్గాల్లో పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అయితే, జమ్మూకాశ్మీర్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మాత్రం హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. 
 
కాశ్మీర్‌లోని ఉగ్రదాడి జరిగిన పుల్వామాలో (అనంతనాగ్ నియోజకవర్గం) సోమవారం పోలింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా పుల్వామాలోని ఓ పోలింగ్ బూత్‌పై ఆగంతుకులు గ్రెనేడ్ విసిరారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి గాయపడ్డాడు. ఈ దాడి నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 
 
అయితే, దాడులు జరుగుతాయనే భయంలో ఇక్కడ ఏ పార్టీ నేతలు కూడా ప్రచారం నిర్వహించలేదు. మరోవైపు, ఇక్కడ ఓటింగ్ శాతం రెండంకెల శాతానికి చేరుకోకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఓటర్లు కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. 
 
ఇకపోతే, పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. బారక్‌పూర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అర్జున్ సింగ్‌పై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఓ పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించడంతో ఆగ్రహించిన ఓటర్లు ఆయనపై దాడి చేసినట్టు సమాచారం. 
 
దాడి అనంతరం ఆయన మాట్లాడుతూ, ఓటర్లతో తాను మాట్లాడుతుండగా తనపై టీఎంసీ వర్గీయులు దాడి చేశారని చెప్పారు. పక్కా ప్రణాళికతోనే దాడి చేశారని తెలిపారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో టీఎంసీ మూకల దాడులకు అంతులేకుండా ఉందని మండిపడ్డారు. రక్తం కారుతున్న తన నోరే దీనికి నిదర్శనమన్నారు.