శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 29 నవంబరు 2020 (18:23 IST)

జైలులో ఖైదీల కోసం ఎటిఎం..ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు

బీహార్‌లోని పూర్నియా సెంట్రల్‌ జైలులో ఖైదీలు వారి రోజువారీ అవసరాల కోసం డబ్బును తీసుకోవడానికి జైలు ప్రాంగణంలో ఎటిఎం (ఆటోమేటెడ్‌ టెల్లర్‌ మెషిన్‌) ఏర్పాటు చేశారు.

జైలు గేటు వద్ద ఖైదీలు, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు డబ్బును డ్రా చేసుకునేందుకు జైలు లోపల ఎటిఎం ఏర్పాటు చేశామని పూర్నియా జైలు సూపరింటెండెంట్‌ జితేంద్రకుమార్‌ చెప్పారు.

పూర్నియా జైలులో 750 మంది ఖైదీలుండగా, వారిలో 600 మంది ఖైదీలకు బ్యాంకులో ఖాతాలున్నాయి. వీరిలో 400 మందికి ఎటిఎం కార్డులను జారీ చేశామని, మిగిలినవారికి కూడా ఎటిఎం కార్డులను త్వరలో జారీ చేస్తామని బ్యాంకు అధికారులు చెప్పారు.

జైలులోని ఖైదీలకు 4 నుంచి 8 గంటల పనికి రోజుకు 52 రూపాయల నుంచి 103 రూపాయల వరకు వేతనాన్ని చెల్లిస్తున్నారు. జైలులోని చిన్న, కుటీర పరిశ్రమల్లో పనిచేసిన ఖైదీలకు వేతనాలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు.

ఖైదీలు జైలులో ఫేస్‌ మాస్కులు తయారు చేస్తున్నారు. జైలు మాన్యువల్‌ ప్రకారం ఒక్కో ఖైదీ 500 రూపాయల నగదును డ్రా చేసి ఉంచుకునేందుకు అనుమతి ఉంది. ఖైదీలు వారి వేతనాల డబ్బు నుంచి సబ్బులు, హెయిర్‌ ఆయిల్‌, తినేందుకు చిరుతిళ్ల కొనుగోలుకు ఉపయోగించుకోవచ్చని జైలు అధికారులు తెలిపారు.