శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Updated : గురువారం, 6 ఆగస్టు 2020 (15:27 IST)

కరోనాకు చికిత్స కన్నా.. నివారణ మిన్న

'కరోనాకు చికిత్స కన్నా నివారణే మేలు'.. ఈ మాట మనందరికీ అందరికీ తెలిసిందే. రోగం వచ్చాక చికిత్స తీసుకోవడం కంటే.. ఆ రోగం రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. కోవిడ్ వైరస్ విషయంలోనూ అంతే. ఈ వైరస్ బారిన పడకుండా ఉండటమే ఇప్పుడు అందరికీ అవసరం.

కోవిడ్ వైరస్‌ను ఎదుర్కోవడానికి రోగనిరోధక శక్తి పెంచుకోవడం ఎంతో అవసరం. కాలానుగుణంగా జరిగే మార్పులకు అనుగుణంగా మన రోజువారీ అలవాట్లను కూడా మార్చుకోవవడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని తయారు చేసుకోవచ్చు.
 
ముఖ్యంగా ఇప్పుడు అందరూ కోవిడ్ ను ఎదుర్కొనేందుకు రోగనిరోధక శక్తిని పెంచుకోవడంతోపాటు మాస్క్ ధరించడం, తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం కూడా ముఖ్యమైనవే. ఒక వేళ కోవిడ్ వైరస్ సోకినా శరీరంలో రోగనిరోధక శక్తి ఉండడం కారణంగా త్వర‌గా కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రాణాపాయ ప‌రిస్థితులు ఏర్పడ‌కుండా ఉంటాయి.

అందుకే కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి కేంద్ర ఆయుర్వేద, యోగ, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియో మంత్రిత్వ శాఖ (ఆయుష్ శాఖ) చెబుతోంది. ప్రతి ఒక్కరూ ఆయుష్ మంత్రిత్వశాఖ ఇచ్చిన సూచనలను పాటిస్తూ రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నించాలి. 
 
రోగనిరోధక శక్తిని పెంచుకునే సాధారణ పద్ధతులు: 
* దాహం అనిపించినప్పుడల్లా గోరు వెచ్చని నీటినే తాగండి
* ప్రతి రోజూ కనీసం 30 నిమిషాలు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయండి
* రోజువారీ వంటకాలలో పసుపు, జీలకర్ర, దనియాలు, వెల్లుల్లి తప్పకుండా ఉండేలా చూసుకోండి 
* ప్రతి రోజు కనీసం 20 నిమిషాల పాటు ఎండలో ఉండండి
 
ఆయుర్వేద పద్ధతుల ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకునే మార్గాలు: 
* ప్రతి రోజూ ఉదయం ఒక టీస్పూను చవనప్రాశ్ తినాలి. మధుమేహ వ్యాధి ఉన్నవారు చక్కెర లేని  చవనప్రాశ్ తీసుకోవాలి 
* తులసి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, శొంఠి, ఎండు ద్రాక్ష మొదలైనవాటితో చేసిన ఆయుర్వేద తేనీరు రోజుకు ఒకటి లేదా రెండుసార్లు తాగండి. అలాగే మీ అభిరుచిని బట్టి బెల్లం లేదా తాజా నిమ్మరసాన్ని కలుపుకోవచ్చు. 
* 150 మిల్లీ లీటర్ల పాలలో అరస్పూను పసుపు కలుపుకొని రోజుకు ఒకటి లేక రెండుసార్లు తాగండి 
 
సులభమైన ఆయుర్వేద పద్ధతులు: 
*  నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె లేదా నెయ్యిని ముక్కు రంధ్రాల దగ్గర పట్టించండి. ఇలా ఉదయం మరియు సాయంత్రం చేయండి
*  ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెను తీసుకుని నోటిలో వేసుకుని రెండు మూడు నిమిషాలపాటు పుక్కిలించి తర్వాత ఊసేయాలి. ఆ తరువాత వెంటనే నోటిని గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇలా రోజుకు ఒకటి రెండుసార్లు చేయవచ్చు
* పొడిదగ్గు ఉంటే పుదీనా ఆకులను లేదా సోపు గింజలు కలిపిన నీటి ఆవిరిని రోజుకు ఒకసారి పీల్చుకోవాలి
*  లవంగాల పొడిని బెల్లంతో లేదా తేనెతో కలుపుకుని రోజుకు రెండుసార్లు తీసుకుంటే దగ్గు లేదా గొంతు గరగర నుంచి ఉపశమనం లభిస్తుంది.
*  ఒకవేళ పొడి దగ్గు ఎక్కువగా ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి
* లవంగాలు పొడిచేసుకొని చక్కెర, తేనెలో కలిపి రోజూ రెండుమూడుసార్లు తినాలి.
 
క్యారెట్లు, ఆకుకూర‌లు:
క్యారెట్లు, ఆకుకూర‌ల్లో విట‌మిన్-ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. ర‌క్తంలో ఉండే విష ప‌దార్థాలు, సూక్ష్మక్రిములు తొల‌గిపోతాయి. క్యారెట్లతోపాటు ఆకుకూర‌లు, చిల‌గ‌డ‌దుంప‌,  కీరాదోస‌, మామిడి పండ్లు, క‌ర్బూజా పండ్లలో, యాప్రికాట్లలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మ‌న శ‌రీరంలో విట‌మిన్-ఎ గా మారి మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది.
 
నారింజ‌, ద్రాక్ష
మ‌న శ‌రీరంలో రోగ నిరోధ‌క క‌ణాల‌ను, తెల్ల ర‌క్త క‌ణాల‌ను వృద్ధి చేసేందుకు విట‌మిన్-సి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ద్రాక్ష, నారింజ‌, బ‌త్తాయి పండ్లు, కివీలు, స్ట్రాబెర్రీలు, బెంగ‌ళూరు క్యాబేజీ, క్యాప్సికం, మిరియాలు, ఉడ‌క‌బెట్టిన క్యాబేజీ, కాలిఫ్లవర్‌ల‌లో మ‌న‌కు విట‌మిన్-సి అధికంగా ల‌భిస్తుంది. దీంతో శరీర రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది.
 
కోడిగుడ్లు, పాలు
బాక్టీరియా, వైర‌స్‌లు ర‌క్తంలో ఇన్ఫెక్షన్లను క‌లిగిస్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే విట‌మిన్-డి త‌గినంత‌గా ఉంటే ఆ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అందుకు విట‌మిన్ డి ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. ఇది మ‌న‌కు సూర్యర‌శ్మి ద్వారా ల‌భిస్తుంది.

అలాగే చేప‌లు, గుడ్లు, పాలు, చీజ్‌, వెన్న, ప‌నీర్‌, పుట్టగొడుగులలోనూ విట‌మిన్-డి ల‌భిస్తుంది. వీటిని త‌ర‌చూ తీసుకోవ‌డం ద్వారా శ‌రీరంలో ఇన్‌ఫెక్ష‌న్లు ఏర్పడ‌కుండా చూసుకోవ‌చ్చు. అలాగే రోగ నిరోధ‌క వ్యవ‌స్థ ప‌టిష్టమ‌వుతుంది. రోజూ పసుపుపాలు తాగడం కూడా మంచిది. 150 మిల్లీలీటర్ల పాలలో అర చెంచా పసుపు కలిపి రోజూ ఒకటి లేదా రెండు పూటలు తాగాలి. 
 
పౌల్ట్రీ ఉత్పత్తులు, సోయా
పౌల్ట్రీ ఉత్పత్తులు, సోయాబీన్‌, మాంసం, శ‌న‌గ‌లు, చిక్కుడు జాతి గింజ‌లు, చిరు ధాన్యాలు, గింజ‌లు, చీజ్, ప‌నీర్‌, పెరుగుల‌లో జింక్ ఎక్కువ‌గా ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు జింక్ ల‌భిస్తుంది. దీంతో శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.
 
పైన సూచించిబడిన వాటిని తీసుకుంటూ మనలో రోగనిరోధక శక్తిని పెంచుకుందాం. కరోనా మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కొందాం.