శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 22 జులై 2020 (18:37 IST)

ఏపీలో కరోనా కల్లోలం.. 24 గంటల్లో 6045 కేసులు.. 65 మరణాలు

ఏపీలో కరోనా చెలరేగిపోతోంది. మృత్యు ఘంటికలు మోగిస్తూ రికార్డు స్థాయిలో ప్రాణాలను బలితీసుకుంటోంది. బుధవారం అత్యధికంగా 65 మంది కరోనాకు బలయ్యారు. 6045 మంది కరోనా బారిన పడ్డారు.

రాష్ట్రంలో వైరస్‌ విలయం మొదలయ్యాక ఒక్కరోజులో ఇన్ని మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. మొన్నటి వరకు 1 శాతం కంటే తక్కువ ఉన్న మరణాల శాతం నెమ్మదిగా 1.25 శాతానికి పెరిగింది.

తాజా కేసుల్లో అత్యధికంగా విశాఖపట్నంలో 1049, తూర్పుగోదావరిలో 891, గుంటూరులో 842, కర్నూలులో 678, పశ్చిమగోదావరిలో 672, చిత్తూరులో 345,  అనంతపురంలో 325, కృష్ణాలో 151, కడపలో 229, శ్రీకాకుళంలో 252,  ప్రకాశంలో 177, విజయనగరంలో 107, నెల్లూరుజిల్లాల్లో 327 మందికి పాజటివ్‌ వచ్చింది. 
 
భారత్‌లో...
భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 37,724 పాజిటివ్‌ కేసులు వెలుగుచూడటంతో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 11,92,915కు చేరింది. మహమ్మారి బారినపడి కోలుకున్న వారి సంఖ్య 7,53,050కి పెరగడం ఊరటనిస్తోంది.

దేశంలో ప్రస్తుతం 4,11,133 యాక్టివ్‌ కేసులున్నాయి. ప్రాణాంతక వైరస్‌తో గడిచిన 24 గంటల్లో 648 మంది మరణించడంతో కరోనా మరణాల సంఖ్య 28,732కి చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈనెల 21 వరకూ 1,47,24,546 శాంపిళ్లను పరీక్షించినట్టు ఐసిఎంఆర్‌ వెల్లడించింది.