పేరుకే ర్యాంప్ మీద వయ్యారంగా నడిచే మోడల్... విద్యార్థులకు డ్రగ్ సరఫరా... కర్ణాటక మోడల్ దర్శిత్మిత అరెస్టు
డ్రగ్స్ రాకెట్ కేసులో బెంగళూరుకు చెందిన ప్రముఖ మోడల్ దర్శిత్మిత గౌడని పోలీసులు అరెస్ట్ చేశారు. ర్యాంప్ మీద వయ్యారంగా నడచి కుర్రకారుని మత్తెక్కించే ఈ అమ్మడు డ్రగ్స్‌ను సరఫరా చేస్తుందని కర్ణాటక పోలీసులు చెబుతున్నారు. దీంతో నార్కోటిక్స్ డ్రగ్స్, సైకోట్రోఫిక్ కంట్రోల్ చట్టానికి చెందిన వివిధ సెక్షన్లకింద ఆమెపై కేసులు నమోదు చేసినట్టు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ అధికారులు తెలిపారు.
పూర్తి వివరాలను పరిశీలిస్తే... కర్ణాటకలోని చిక్కమంగళూరుకు చెందిన ప్రముఖ మోడల్.. 26 ఏళ్ళ దర్శిత్మిత గౌడను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ భామ మత్తు పదార్థాలను మంగుళూరు, బెంగళూరు, గోవాల్లోని విద్యార్థులతోపాటు ఇతరులకు సరఫరా చేస్తున్న ముఠాలో పనిచేస్తోందన్న అనుమానంతో ఆమెపై ఎన్సీబీ అధికారులు నిఘా పెట్టారు. ఆమె నివసిస్తున్నఅపార్ట్‌మెంట్‌లో సోదాలు నిర్వహించినప్పుడు 110 గ్రాముల కొకైన్, 19 గ్రాముల హషీస్, మరికొన్ని మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
సోదాలు నిర్వహించిన సమయంలో దర్శిత్మిత ఇంట్లో లేదని... ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న బాయ్ ఫ్రెండ్ నిశాంత్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్శిత్మిత నిర్వహిస్తున్న అక్రమ డ్రగ్ సరఫరాకు నిశాంత్ కూడా సహకరిస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు.. ఇద్దరిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.