ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 17 జనవరి 2017 (08:34 IST)

నేడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ శతజయంతి.. ఓ యేడాది పాటు వేడుకలు

అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ శతజయంతి వేడుకలు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా జరుగనున్నాయి. మొన్నటివరకు పార్టీ అధినేత్రిగా ఉన్న ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం జరుగుతున్న ఎంజ

అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ శతజయంతి వేడుకలు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా జరుగనున్నాయి. మొన్నటివరకు పార్టీ అధినేత్రిగా ఉన్న ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం జరుగుతున్న ఎంజీఆర్‌ జయంతి ఇదే కావడంతో ఆయనపై తమ అభిమానాన్ని చాటుకునేందుకు, ఆయన తమ పక్షమేనని ప్రజలకు చూపించేందుకు ఎవరికి వారు పోటీ పడుతున్నారు. 
 
మరీ ముఖ్యంగా అన్నాడీంకే ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టిన తర్వాత జరుగుతున్న పార్టీ వ్యవస్థాపకుడి తొలి జయంతి కావడం, అది కూడా శతజయంతి కావడంతో తనదైనశైలిలో కార్యక్రమాలను నిర్వహించి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకునేందుకు శశికళ ప్రణాళికలు రూపొందించారు.
 
ఇందులోభాగంగా, మంగళవారం ఉదయమే స్థానిక మెరీనా తీరంలోని ఎంజీఆర్‌ సమాధి వద్దకెళ్లి అంజలి ఘటించడంతో పాటు రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయానికి శశికళ వెళ్లనున్నారు. అక్కడ ఎంజీఆర్‌ విగ్రహానికి అంజలి ఘటించడంతో పాటు ప్రత్యేక సంచికను ఆవిష్కరించనున్నారు. అనంతరం కార్యకర్తలతో మాటామంతీ జరిపిన అనంతరం నేరుగా రామాపురంలో ఉన్న ఎంజీఆర్‌ నివాసగృహానికి చేరుకుంటారు.
 
అక్కడ అన్నాడీంకే పతాకాన్ని, ఎంజీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. మరోవైపు ఎంజీఆర్‌ దత్తపుత్రిక సుధ హఠాత్తుగా తెరపైకి రావడం అన్నాడీఎంకేలో కొత్త సంకేతాలను పంపుతోంది. అయితే ఆమె శశికళకు మద్దతుగా మాట్లాడటం, ఎంజీఆర్‌ విగ్రహావిష్కరణకు తానే ఆహ్వానించినట్లు చెప్పడంతో ఆ పార్టీలో కొంత ప్రశాంతత నెలకొంది.