దేశీయ ప్రయాణాలకు కేంద్రం మార్గదర్శకాలు
లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో కేంద్రం దేశీయ ప్రయాణాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. విమాన, రైలు, అంతర్రాష్ట్ర బస్సు ప్రయాణాలకు ఈ మార్గదర్శకాలు ఉపకరించనున్నాయి.
టికెట్ బుకింగ్ ఏజెన్సీలు టికెట్లతో పాటు వివరాలు కూడా ముద్రించాలని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రయాణికులు తప్పనిసరిగా ఆరోగ్యసేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్ వద్ద కరోనాపై ప్రకటనలు చేయాలని ఆదేశించింది.
విమానాలు, బస్సులు, రైళ్లలో పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రకటనలు చేయాలని వివరించింది. ప్రయాణాలకు సిద్ధమైన వారు తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాలని కేంద్రం పేర్కొంది. లక్షణాలు లేని ప్రయాణికులకే విమాన, రైలు, బస్సుల్లో ఎక్కేందుకు అనుమతి ఇస్తారని వివరించింది.
లక్షణాలు లేకపోతే 14 రోజుల స్వీయ పర్యవేక్షణపై వెళ్లేందుకు అనుమతి ఇస్తారని తెలిపింది. లక్షణాలు కనిపిస్తే జిల్లా, రాష్ట్ర, జాతీయ కాల్ సెంటర్ కు సమాచారం అందించాలని వెల్లడించింది. బోర్డింగ్, ప్రయాణంలో అందరూ ముఖం కప్పుకోవాలని, లేదా మాస్క్ ధరించాలని స్పష్టం చేసింది.
విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినళ్ల వద్ద భౌతికదూరం పాటించాలని తెలిపింది. ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినళ్లను తప్పనిసరిగా శుభ్రపరచాలని పేర్కొంది. ఈ మార్గదర్శకాలపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తగిన ఆదేశాలు జారీ చేస్తాయని వెల్లడించింది.