ఏపీ పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షలో వింత ప్రశ్నలు
రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి ప్రీఫైనల్ పరీక్ష పశ్నపత్రంలో వింత ప్రశ్నలు వచ్చాయి. హిందీ, ఇంగ్లీష్ ప్రశ్నపత్రాల్లో అమ్మ ఒడి పథకంపై ప్రశ్నలు అడగటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. అమ్మ ఒడి పథకం అమలు తీరును వివరిస్తూ చెన్నైలో ఉండే మీ ఫ్రెండ్‌కి లేఖ రాయాలంటూ పరీక్ష ప్రశ్న వచ్చింది. మొదటి ప్రశ్నగా అమ్మ ఒడి పథకం కింద ఎంతమంది లబ్ధిదారులున్నారు? అర్హత నిబంధనలు, కొత్త పథకం అమలు తీరు ఎలా జరుగుతుందనే అంశాలపై లేఖ రాయాలంటూ పేర్కొన్నారు.
ఈ ప్రశ్నకు ఎస్ఎస్‌సీ బోర్డు 5 మార్కులిచ్చింది. పరీక్ష పత్రంలోని సెక్షన్ 'C'లోనే అమ్మ ఒడి పథకంపై రెండు ప్రశ్నలు ఇచ్చారు. మరో ప్రశ్నగా ఓ దినపత్రిక స్పెషల్ కరస్పాండెంట్‌గా ఊహించుకొంటూ మీ స్కూల్‌లో అమ్మఒడి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వార్తా కథనంగా రాయాలని అడిగారు. ఈ రెండు ప్రశ్నల్లో ఏదో ఒక ప్రశ్నకు సమాధానం రాయాలని పేర్కొన్నారు.
హిందీ, ఇంగ్లీష్ ప్రశ్న పత్రాల్లో సృజనాత్మక వ్యక్తీకరణ విభాగం కింద అమ్మ ఒడి పథకంపై ప్రశ్నలు ఇచ్చారు. అయితే రెండు ఛాయిస్‌ల్లోనూ ఒకే పథకంపై ప్రశ్నలు రావడంతో వీటిల్లో ఏదో ఒకదానికి సమాధానం రాయక తప్పని పరిస్థితి ఏర్పడింది. కాగా, ప్రీఫైనల్ పరీక్షలో ఇలాంటి ప్రశ్నలు రావటం సర్వత్రా చర్చనీయాంశమైంది.