బుధవారం, 5 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 18 ఫిబ్రవరి 2017 (03:14 IST)

శశికళా వద్దూ.. ఆమెకు మద్దతు పలికే మీరూ వద్దూ.. విద్యార్థిని ఆడియో వైరల్

శశికళా వద్దూ... ఆమెకు మద్దతు పలుకుతున్న మీరూ వద్దంటూ తమిళనాడు విద్యాశాఖ మంత్రి సెంగొట్టయన్‌ను ఉద్దేశించి ఒక విద్యార్థిని చేసిన విమర్శల ఆడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది.

శశికళా వద్దూ... ఆమెకు మద్దతు పలుకుతున్న మీరూ వద్దంటూ తమిళనాడు విద్యాశాఖ మంత్రి సెంగొట్టయన్‌ను ఉద్దేశించి ఒక విద్యార్థిని చేసిన విమర్శల ఆడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. రాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష ద్వారా పళనిస్వామి, పన్నీర్ సెల్వం బలాబలాలు తేలనున్న నేపథ్యంలో.. గోపిచెట్టి పాళయంకు చెందిన కాలేజీకి చెందిన ఒక విద్యార్థిని శుక్రవారం సెంగోట్టయన్‌కు ఫోన్‌ చేయగా మీటింగ్‌లో ఉన్నారని ఆయన అనుచరుడు బదులిచ్చాడు. దీంతో మంత్రికి తన అసంతృప్తిని చేరవేయమని చెబుతూ జరిగిన సంభాషణలను ఆమె సామాజిక మాధ్యమాల్లో పెట్టింది. ఇది ఇప్పుడు తమిళనాడులో వైరల్ అయింది. 
 
కాగా ముఖ్యమంత్రిగా బలపరీక్షలో నెగ్గకముందే పళనిస్వామి ప్రతీకార రాజకీయాలకు తెర లేపారా? మాజీ సీఎంగా మారిన పన్నీర్ సెల్వంని రెండు రోజులు కాకముందే ప్రభుత్వ బంగ్లాని ఖాళీ చేయాలంటూ ప్రజాపనుల శాఖ నోటీసులు జారీ చేయడం శశికళ ప్రతీకార రాజకీయాల్లో భాగమేనని రూమర్లు పుట్టాయి. ముఖ్యమంత్రి హోదాలో పన్నీర్‌సెల్వం తన కుటుంబం సహా నివసిస్తున్న చెన్నై గ్రీన్‌వేస్‌ రోడ్డులోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా ప్రజాపనుల శాఖ ఆయనకు శుక్రవారం నోటీసులు జారీచేసింది. 
 
మరోవైపున విశ్వాస పరీక్షలో పళనిస్వామి ప్రభుత్వం నెగ్గినట్లయితే రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజాన్యాయస్థానంలోనే ఎమ్మెల్యేలను నిలదీసేందుకు పన్నీర్‌ సిద్ధమవుతున్నారు. విశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటువేస్తే అది ప్రజలకు, అమ్మ ప్రభుత్వానికి చేసిన ద్రోహమవుతుందని వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం చెన్నైలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... ఎమ్మెల్యేలు ఎటువంటి ప్రలోభాలకు లొంగరని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు కోరుకున్నవారికే రెండాకుల చిహ్నం సొంతమన్నారు. 
 
ప్రజామద్దతును కూడగట్టుకుని ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచేందుకు పన్నీర్‌సెల్వం వర్గం శుక్రవారం తలపెట్టిన ర్యాలీకి పోలీసులు బ్రేకు వేశారు. మరోవైపు అసెంబ్లీలో బలపరీక్ష సమయంలో సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలపై  ఒత్తిడి పెంచేందుకు జల్లికట్టు తరహా ఉద్యమానికి  యువత మెరీనా బీచ్‌కు చేరుకుంటారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో మెరీనాతీరమంతా భారీగా బారికేడ్లు ఏర్పాటుచేసి, పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.