గ్యాంగ్‌స్టర్‌లపై ఉక్కుపాదం.. యూపీలో మరొకరు హతం
తమ రాష్ట్రంలోని గ్యాంగ్‌స్టర్‌లపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్రంలో గ్యాంగ్‌స్టర్ అనే వాడు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నట్టుగా ఉంది. అందుకే గత కొన్ని రోజులుగా పేరుమోసిన గ్యాంగ్‌స్టర్లను హతమార్చుతూ వస్తుంది. తాజాగా మరో గ్యాంగ్‌స్టర్‌ను లేపేసింది.
లక్నో నగరంలోని ఓ కోర్టులో పట్టపగలు సంజీవ్ జీవా అనే గ్యాంగ్‌స్టర్ హత్యకు గురయ్యాడు. జీవాపై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి. దీంతో విచారణ నిమిత్తం కోర్టుకు తీసుకొచ్చారు. అయితే, న్యాయవాదుల తరహాలో అక్కడకు వచ్చిన వచ్చిన కొందరు దుండగులు జీవాను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్ అక్కడే కుప్పకూలి, ప్రాణాలు విడిచాడు. ఈ కాల్పుల్లో మరో బాలిక తీవ్రంగా గాయడింది.
సంజీవ్ జీవా... వెస్ట్ యూపీలో కరడుగట్టిన గ్యాంగ్ స్టర్‌గా గుర్తింపు పొందాడు. వివాదాస్పద నేత ముక్తార్ అన్సారీకి జీవా కుడిభుజం లాంటివాడు. బీజేపీ ఎమ్మెల్యే బ్రహ్మదత్ ద్వివేది హత్య కేసులో ముక్తార్ అన్సారీ నిందితుడు కాగా, జీవా సహనిందితుడిగా ఉన్నాడు. కాగా, జీవా కాల్చివేతపై ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందిస్తూ, ఈ ఘటనపై తమకు సమాచారం లేదన్నారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఈ ఉదంతంపై మండిపడ్డారు. మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? అని ప్రశ్నించారు. భద్రత అధికంగా ఉన్నచోటే హత్యలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు.