ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 4 ఏప్రియల్ 2020 (17:03 IST)

ఆ 'వైరస్' ను రెండేళ్ల క్రితమే ఊహించా: రాంగోపాల్ వర్మ

సంచలనాల దర్శకుడు, వివాదాలకు కేంద్ర బిందువైన రాంగోపాల్ వర్మ .. ఇప్పటి వైరస్ వైపరీత్యాలను రెండేళ్ల క్రితమే ఊహించారట. ఆ మేరకు సినిమా కూడా తీయాలనుకున్నారట. ఆ సినిమా పేరు ‘వైరస్‌’.

తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే తాను ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందేవాడినని ఇప్పుడు తెగ ఇదైపోతున్నారట పాపం! తన మాటలు అబధ్ధమనుకుంటారేమోనని రెండేళ్ల క్రితం 2018 జూన్‌ 10న తాను చేసిన ట్వీట్ ని కూడా బయట పెట్టారు.

సర్కార్‌, అటాక్స్‌ ఆప్‌ 26/11 సినిమాలు నిర్మించిన పరాగ్‌ సంఘ్వి తన సినిమాను నిర్మిస్తున్నారని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. దీంతో పాటు ఒక ప్రకటన లింక్‌ కూడా జత చేశారు. ‘వైరస్‌’ సినిమా కథ గురించి క్లుప్తంగా అందులో వివరించారు. 
 
వైరస్‌ కథ ఏంటంటే..?
మధ్య ఆఫ్రికాలో వైరస్‌ బారిన పడిన ఓ విద్యార్థి నుంచి ఈ వైరస్‌ కార్చిచ్చులా ముంబై నగరమంతా వ్యాపిస్తుంది. భాయాందోళనతో చేష్టలుడిన ప్రభుత్వం ముంబై వాసులను పరస్పరం 20 అడుగుల భౌతిక దూరం పాటించమని సూచిస్తుంది.

వైరస్‌ విజృంభణతో మరణాల సంఖ్య లక్ష దాటిపోవడంతో వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు బాహ్య ప్రపంచంతో ముంబై సంబంధాలను ప్రభుత్వం కట్‌ చేస్తుంది. నిర్బంధం నుంచి ఎవరైనా తప్పించుకోవాలని చూస్తే కాల్చి చంపాలని ప్రభుత్వం తీవ్ర ఆదేశాలు జారీ చేస్తుంది.

ఒకపక్క భయాందోళనతో వణుకుతున్న నగర ప్రజలు, నిస్సహాయ ప్రభుత్వం.. మరో పక్క వైరస్‌ విజృంభణ నేపథ్యంలో కథ సాగుతుంది. భయం, విషాదం, త్యాగం, ఆశ, నిరాశ వంటి ఉద్వేగాల మేళవింపుతో సినిమా ఉంటుందని వర్మ అప్పట్లో పేర్కొన్నారు. ఒకవేళ ఆ సినిమా తెరకెక్కి వుంటే నిజంగానే వర్మ చరిత్రకెక్కేవారే.