శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 అక్టోబరు 2020 (17:10 IST)

యాంటీ రేడియేషన్ మిస్సైల్‌ను పరీక్షించిన భారత్.. ప్రయోగం?

ఇటీవలి కాలంలో భారత్‌కు పొరుగు దేశాల నుంచి ముప్పు ఏర్పడింది. ముఖ్యంగా, చైనా, పాకిస్థాన్ వంటి దేశాలతో పాటు నేపాల్, మయన్మార్, శ్రీలంక వంటి దేశాలు కూడా భారత్‌పైకి ఒంటికాలిపై వస్తున్నాయి. దీంతో భారత్ తన ఆయుధ సంపత్తిని మరింతగా విస్తృత పరుచుకుంటూ పోతోంది. తాజాగా యాంటీ రేడియన్ మిస్సైల్ రుద్రమ్ క్షిపణిని పరీక్షించింది. 
 
ఒరిస్సా సముద్రతీరంలోని బాలాసోర్ ఐటీఆర్ కేంద్రం నుంచి దీన్ని ఓ సుఖోయ్-30 యుద్ధ విమానం నుంచి విజయవంతంగా ప్రయోగించారు. ఈ రుద్రమ్ మిస్సైల్ నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తి చేసింది. ఇది ఎయిర్ టు గ్రౌండ్ తరహా మిస్సైల్. దీని పరిధి పరిధి 100 నుంచి 150 కిలోమీటర్లు.
 
దేశీయంగా ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్న భారత రక్షణ ఫరిశోధనా అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) రుద్రమ్ మిస్సైల్‌ను తయారు చేసింది. రుద్రమ్ క్షిపణి ప్రత్యర్థుల గగనతల రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. రేడియో తరంగాల ద్వారా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న శత్రుదేశాల రాడార్లను గుర్తించి వాటిని స్తంభింపచేయగలదు. వైరి దేశాల ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థల లింకులను తెంచివేయగలదు.
 
భారత వాయుసేన పాటవాన్ని రుద్రమ్ క్షిపణి మరింత ఇనుమడింప చేస్తుందనడంలో సందేహంలేదు. ప్రస్తుతం దీన్ని సుఖోయ్-30 ఎంకేఐ విమానం నుంచి మాత్రమే ప్రయోగిస్తున్నారు. భవిష్యత్తులో మిరేజ్-2000, జాగ్వార్, తేజాస్, తేజాస్ మార్క్-2 పోరాట విమానాలతో అనుసంధానించనున్నారు.