మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 1 అక్టోబరు 2020 (13:35 IST)

జపాన్ 'ట్విటర్ కిల్లర్': ‘అవును ఆ తొమ్మిది మందినీ నేనే చంపాను’

ట్విటర్‌లో తనకు పరిచయమైన తొమ్మిది మంది వ్యక్తులను తాను హత్యచేసినట్లు జపాన్‌ నిందితుడు అంగీకరించాడు. రెండేళ్ల కిందట వెలుగు చూసిన ఈ సీరియల్ హత్యల కేసు జపాన్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. 'ట్విటర్ కిల్లర్'గా పేరుపడ్డ తకషిరో షిరాయిషి ఇంట్లో తొమ్మిది మంది హతుల శరీర భాగాలు దొరకటంతో అతడిని అరెస్ట్ చేశారు.

 
ఈ హత్య కేసుల్లో తనపై చేసిన ''ఆరోపణలన్నీ నిజం'' అని అతడు బుధవారం నాడు టోక్యోలోని ఒక కోర్టులో చెప్పారు. అయితే.. తకషిరో తమను చంపటానికి హతులు సమ్మతి తెలిపినట్లుగా ఉంది కనుక అతడిపై నమోదు చేసిన అభియోగాలను తగ్గించాలని అతడి తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు.

 
ఈ కేసులో దోషిగా నిర్ధరితుడైతే 29 ఏళ్ల తకషిరోకు మరణశిక్ష విధిస్తారు. జపాన్‌లో ఉరి తీయటం ద్వారా ఈ శిక్షను అమలు చేస్తారు. బుధవారం జరిగిన ఈ కేసు తొలి విచారణను వీక్షించటానికి కోర్టు పబ్లిక్ గ్యాలరీలో 13 సీట్లు ఉండగా 600 మందికి పైగా వరుసకట్టారు.

 
ఏం జరిగింది?
''ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచిస్తున్న మహిళలను కలవటం కోసం'' నిందితుడు 2017 మార్చిలో ఒక ట్విటర్ అకౌంట్ ఓపెన్ చేశాడని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. వారిని సులభమైన లక్ష్యాలుగా అతడు భావించాడని పేర్కొంది. హతుల్లో ఎనిమిది మంది మహిళలే. వారిలో ఒకరి వయసు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే.

 
ఒక 20 ఏళ్ల యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్ ఆచూకీ కోసం నిందితుడిని నిలదీసినందుకు అతడిని కూడా హత్య చేశాడని జపాన్ మీడియా చెప్పింది. హతులు చనిపోవటానికి తాను సాయం చేస్తానని చెప్పి వారిని తన దగ్గరకు రప్పించుకున్నాడని, వారితో పాటు తను కూడా ఆత్మహత్య చేసుకుంటానని కొందరిని నమ్మించాడని భావిస్తున్నారు.

 
''నిజంగా చాలా బాధల్లో ఉన్న వారికి సాయం చేయాలని నేను కోరుకుంటున్నా. నాకు ఏ సమయంలోనైనా డైరెక్ట్ మెసేజ్ చేయండి'' అనే మాటలు అతడి ట్విటైర్ ప్రొఫైల్‌లో ఉన్నాయి. ఒక యువతి అదృశ్యంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈ సీరియల్ హత్యల విషయం వెలుగులోకి వచ్చింది. ఆ యువతి ఇతడి చేతిలో హతమైనట్లు ఆ తర్వాత వెల్లడైంది. జపాన్‌లోని టోక్యో శివార్లలో ఉన్న జుమా నగరంలో తకషిరో ఫ్లాట్‌లో తనిఖీలు చేసిన పోలీసులకు.. హతుల శరీరాలు ముక్కలు ముక్కలుగా కనిపించాయి.

 
నిందితుడి లాయర్లు ఏమంటున్నారు?
తకషిరో చేతుల్లో హత్యకు గురైన వారు.. అతడు తమను చంపటానికి అంగీకరించారని.. కాబట్టి అతడిపై అభియోగాలను ''అంగీకారంతో హత్య''కు తగ్గించాలని అతడి తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు. అలా చేస్తే.. అతడికి విధించే శిక్ష ఆరు నెలల నుంచి ఏడు సంవత్సరాల జైలు శిక్షకు తగ్గిపోతుంది. కానీ.. తన న్యాయవాదులతో తకషిరో విభేదిస్తున్నట్లు చెప్తున్నారు.

 
హతులను వారి సమ్మతి లేకుండానే తాను హత్య చేసినట్లు అతడు స్థానిక దినపత్రిక 'మాయినిచి షింబున్'‌తో చెప్పాడు. ''హతుల తలల వెనుక భాగాల్లో గాయాలున్నాయి. దాని అర్థం వారు సమ్మతి తెలుపలేదని. వారు ప్రతిఘటించకుండా ఉండాలని నేను అలా చేశాను'' అని అతడు చెప్పినట్లు ఆ పత్రిక బుధవారం ప్రచురించిన కథనంలో తెలిపారు.

 
ఈ హత్యల ప్రభావం ఏమిటి?
ఈ వరుస హత్యలు జపాన్‌ను దిగ్భ్రాంతికి గురిచేశాయి. 2017లో ఈ ఉదంతాలు వెలుగులోకి వచ్చిన తర్వాత.. ఆత్మహత్యల గురించి చర్చించే వెబ్‌సైట్ల మీద కొత్త చర్చను లేవనెత్తాయి. ఈ విషయంలో కొత్త నిబంధనలను ప్రవేశపెడతామని ప్రభుత్వం ఆ సమయంలో సూచించింది.

 
ఈ హత్యల కారణంగా.. ట్విటర్‌లో కూడా కొన్ని మార్పులు జరిగాయి. ''యూజర్లు ఆత్మహత్యను కానీ, స్వీయ హానిని కానీ ప్రోత్సహించరాదు'' అని చెప్తూ నిబంధనలను సవరించింది. పారిశ్రామికీకరణ జరిగిన దేశాల్లో ఆత్మహత్యలు అత్యధికంగా ఉన్న దేశాల్లో జపాన్ ఒకటిగా ఉండింది. దాదాపు దశాబ్ద కాలం కిందట నివారణ చర్యలు ప్రవేశపెట్టిన తర్వాత ఆత్మహత్యల తీవ్రత తగ్గింది.