శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 సెప్టెంబరు 2020 (20:52 IST)

లాక్‌డౌన్‌తో ఇంట్లోనే భర్త తిష్ట, ప్రియుడి కోసం భర్తను చంపి కాల్చి బూడిది చేసింది

తన ప్రియుడిని కలుసుకోవడం ఇబ్బందిగా మారిందని భావించిన ఓ కసాయి భార్య.. కట్టుకున్న భర్తను గొంతు బిగించి హత్య చేసింది. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గేటుపల్లి తండాకు చెందిన దర్యావత్ సింగ్ (42) హన్మకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఆరేళ్ల క్రితం మహబూబాబాద్ జిల్లా తాళ్లపూసలపల్లికి చెందిన జ్యోతిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉంది. 
 
ప్రస్తుతం నెక్కొండలో కాపురం ఉంటున్నారు. దర్యావత్ భార్య జ్యోతికి అప్పల్‌రావుపేట గ్రామానికి చెందిన సాంబరాజు అనే యువకుడితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలిసిన భర్త పలుమార్లు భార్యను మందలించాడు. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
 
ఈ క్రమంలో కరోనా మహమ్మారి కారణంగా దర్యావత్ విధులకు వెళ్ళకుండా ఇంటిపట్టునే ఉండసాగాడు. దీంతో జ్యోతికి ప్రియుడిని కలుసుకోవడం ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో భర్త అడ్డు తొలగించుకుంటే ప్రియుడుతో ఉండొచ్చని భావించింది. 
 
ఈ క్రమంలో ఈ నెల 14న భర్త మద్యం తాగి ఇంటికి రావడంతో ఇదే అదునుగా భావించిన జ్యోతి ప్రియుడు సాంబరాజుకు ఫోన్ చేసి విషయం చెప్పింది. అతడిని హతమార్చేందుకు ఇదే మంచి సమయమని రెచ్చగొట్టింది.
 
ప్రియురాలి నుంచి ఫోన్ వచ్చిన మరుక్షణమే ఇంట్లో వాలిపోయిన సాంబరాజు.. జ్యోతితో కలిసి దర్యావత్ గొంతు బిగించి హత్యచేశారు. అనంతరం వెంట తెచ్చిన ట్రాలీ ఆటోలో మృతదేహాన్ని పత్తి చేనులోకి తరలించి, అక్కడే పెట్రోల్ పోసి నిప్పంటించారు. అయితే, మరుసటి రోజు వెళ్లి చూడగా మృతదేహం సగమే కాలింది. దీంతో మృతదేహాన్ని పూర్తిగా కాల్చేసి బూడిదను తీసుకెళ్లి చెరువులో కలిపేశాడు.
 
ఈ క్రమంలో తన తమ్ముడు దర్యావత్ కనిపించకపోవడంతో అన్న వీర్రాజు 21వ తేదీన నెక్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు జ్యోతి తీరుపై అనుమానంతో ఆమె కాల్‌డేటాను సేకరించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ప్రియుడితో కలిసి హత్య చేసినట్టు అంగీకరించడంతో ఇద్దరినీ అరెస్టు చేశారు.