శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 జనవరి 2021 (22:31 IST)

బీహార్‌లో చిచ్చురేపిన ఇండిగో ఎయిర్‌లైన్స్ ఉద్యోగి హత్య... చిక్కుల్లో సీఎం నితీశ్

ఇండిగో ఎయిర్‌లైన్స్ మేనేజర్ రూపేశ్ సింగ్ (44) హత్య బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపుతోంది. ఇది ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టేలా ఉంది. ఇప్పటికే బీజేపీ, జేడీయూ మధ్య విభేదాలు పెరుగుతున్నాయనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ తరుణంలో... ఈ హత్య ఆయన ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. నితీశ్‌పై బీజేపీ నేతలు బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. పైగా, సీఎం పదవికి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేయగా, జేడీయూ భాగస్వామ్య పార్టీ అయిన బీజేపీ సైతం బహిరంగంగానే విమర్శలు ఎక్కుపెట్టింది.
 
కాగా, రూపేష్ సింగ్ (44) మంగళవారం సాయంత్రం పాట్నాలోని తన ఇంటి బయట గేటు ముందే అగంతకుల కాల్పుల్లో మృతిచెందారు. ముఖ్యమంత్రి నివాసానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఘటన జరిగింది. తలుపులు వేసి ఉండటంతో గేటు బయట ఎస్‌యూవీలో వేచిచూస్తుండగా, బైక్ మీద వచ్చిన ఇద్దరు యువకులు ఆయనపై కాల్పులు జరిపారు. 
 
దీనికి కొద్ది గంటల ముందు కోవిడ్ వ్యాక్సిన్ రావడంతో ఆయన పాట్నా విమానాశ్రయంలో కనిపించారు. రూపేష్ సింగ్‌ను ఎయిర్‌పోర్ట్ నుంచి హంతకులు ఛేజ్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రూపేష్ హత్యకు శత్రుత్వం కారణం ఏదైనా ఉందా అనే కోణం నుంచి కూడా దర్యాప్తు చేస్తున్నట్టు పాట్నా సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
 
ఈ ఘటనపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పోలీసులతో మాట్లాడారని, ప్రత్యేక దర్యాప్తు బృందానికి కేసు అప్పగించారని సీఎంఓ సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యమంత్రి సైతం దుండగులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని, విచారణ వేగవంతం చేసి తగిన న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ, ఈ ఘటనపై రాజకీయ దాడులను ఆయన ఆపలేకపోయారు.
 
రూపేష్ సింగ్ హత్య విచారకరమని, తీవ్రమైన విషయమని బీజేపీ ఎంపీ వివేక్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. బీజేపీ మరో నేత, రాజ్యసభ సభ్యుడు గోపాల్ నారాయణ్ సింగ్ ముఖ్యమంత్రిపై మరింత నిశిత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ముఖ్యమంత్రికి అదుపులేదని విమర్శించారు.
 
'బీహార్‌లో ప్రభుత్వం మా (బీజేపీ) మద్దతుతో నడుస్తోంది. కానీ మాకు పరిస్థితి గురించి తెలుసు. మెరుగైన బీహార్‌ కోసం మేము మాట్లాడక తప్పదు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దయనీయంగా ఉంది. అవినీతి కేసులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై అదుపు లేదు. ప్రస్తుతం పోలీసు వ్యవస్థపై ప్రభుత్వానికి పట్టు ఉన్నట్టు కనిపించడం లేదు' అని గోపాల్ నారాయణ్ సింగ్ తప్పుపట్టారు. 
 
కాగా, అధికార కూటమిలో ఇప్పటికే విభేదాలు మొదలైనట్టు ప్రచారం జరుగుతోంది. నవంబర్‌లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జేడీయూ పార్టీ కంటే బీజేపీ ఎక్కువ సీట్లు రాబట్టినప్పటి నుంచే పొరపొచ్చాలు మొదలైనట్టు చెబుతున్నారు.
 
మరోవైపు, శాంతి భద్రతల పరిస్థితిని అదుపులో పెట్టేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే అధికారులు పట్టు బిగించేంత వరకూ సత్ఫలితాలు రావని జనతా దళ్ (యునైటెడ్) ఎంపీ సునీల్ కుమార్ పింటూ తాజా పరిణామాలపై వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు సైతం విపక్షాల దాడిని ఆపలేకపోయాయి.
 
ఇంకో వైపు... బీహార్‌లో నేరగాళ్లే ప్రభుత్వాన్ని ఏలుతున్నారని, రూపేష్ కుమార్‌ను చంపింది పవర్ ప్రొటెక్టెడ్ క్రిమినల్సేనని విపక్ష ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి నివాసానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే హత్య జరిగిందంటే ఏ ఒక్కరి ప్రాణాలకూ భద్రత లేదనే విషయం తేటతెల్లమవుతోందని ఆయన తప్పుపట్టారు. శాంతి భద్రతలను అదుపు చేయడం చేతకాకుంటే నితీష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.