సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 2 డిశెంబరు 2017 (08:39 IST)

ట్రిపుల్ తలాఖ్‌ చెప్తే మూడేళ్ల జైలు.. కొత్తబిల్లు..

ట్రిపుల్ తలాఖ్‌పై ముస్లిం మ‌హిళ‌ల్లో వ్య‌తిరేక‌త రోజురోజుకూ పెరిగిపోతున్న‌ది. ఈ సామాజిక దురాచారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముస్లిం మహిళల రక్షణ చట్టం 1986లో పలు మార్పులు చేయాలని కేంద్రం యోచిస్తో

ట్రిపుల్ తలాఖ్‌పై ముస్లిం మ‌హిళ‌ల్లో వ్య‌తిరేక‌త రోజురోజుకూ పెరిగిపోతున్న‌ది. ఈ సామాజిక దురాచారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముస్లిం మహిళల రక్షణ చట్టం 1986లో పలు మార్పులు చేయాలని కేంద్రం యోచిస్తోంది. తలాఖ్ చెప్పి విడాకులు తీసుకునే వారిని జైలుకు పంపి కఠినంగా శిక్షించాలని యోచిస్తోంది. ఈ దిశగా చర్యలు చేపట్టింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును తీసుకురానుంది. 
 
ఈ బిల్లు చట్టంగా మారితే మహిళలకు చాలావరకు రక్షణ లభిస్తుందని కేంద్రం చెప్తోంది. తలాక్ చెప్పే వారికి మూడేళ్ల జైలు శిక్షతోపాటు భారీగా జరిమానా విధించేలా ముసాయిదా చట్టంలో పేర్కొన్నారు. న్యాయశాఖ, కేంద్ర హోంశాఖ కలిసి దీనిని రూపొందించాయి. ఈ ముసాయిదాను ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ రాష్ట్రాలకు పంపించింది. ముసాయిదాకు ఆమోదం లభిస్తే జమ్మూకాశ్మీర్‌తో పాటు దేశమంతా కొత్త చట్టం అమల్లోకి వస్తుంది.
 
ట్రిపుల్‌ తలాఖ్‌ రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ముస్లిం మహిళల ప్రాథమిక హక్కులకు ట్రిపుల్‌ తలాఖ్‌ భంగం కలిగిస్తున్నదని, రాజీకి ఏమాత్రం అవకావం ఇవ్వకుండా ఏకంగా వివాహాన్ని రద్దు చేయడం ఎంతమాత్రం సమ్మతం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, ఈ విషయంలో తాము నేరుగా జోక్యం చేసుకోలేమని పేర్కొంది. ఈ విధానంపై ఆరు నెలల్లోపు పార్లమెంటులో చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.