శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 మే 2021 (10:06 IST)

కేరళ అసెంబ్లీలో మామ, అల్లుడు.. సరికొత్త అధ్యాయం

కేరళ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన చోటుచేసుకోనుంది. కేరళ అసెంబ్లీ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలు కానుంది. మామ, అల్లుళ్లు కలిసి అసెంబ్లీలోకి త్వరలో అడుగుపెట్టనున్నారు. ఆ మామ, అల్లుళ్లు ఎవరో కాదు సీఎం పినరయి విజయన్, ఆయన అల్లుడు పి.ఎ.మొహమ్మద్‌ రియాస్‌. 
 
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌(77) కన్నూర్‌ జిల్లా ధర్మదామ్‌ నుంచి, ఆయన అల్లుడు రియాస్‌(44) కోజికోడ్‌ జిల్లా బేపోర్‌ నియోజకవర్గం నుంచి, ఎమ్మెల్యేలుగా గెలిచారు.
 
విజయన్‌ కూతురు వీణ, రియాస్‌ 2020లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహం. వీణ బెంగళూరులో ఐటీ సంస్థను నడుపుతుండగా రియాస్‌ డెమోక్రటిక్‌ యూత్‌ ఫెడరేషన్‌ నేషనల్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. రియాస్‌ 2009 లోక్‌సభ ఎన్నికల్లో కోజికోడ్‌ నుంచి బరిలోకి దిగి పరాజయం పాలయ్యారు.
 
2001 తర్వాత కేరళ అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యం మొదటిసారి రెండంకెలకు చేరింది. ఇటీవలి ఎన్నికల్లో అసెంబ్లీలోని 140 స్థానాలకు 103 మంది మహిళలు బరిలో నిలవగా 11 మంది మాత్రం విజయం సాధించారు. వీరిలో 10 మంది అధికార ఎల్డీఎఫ్‌కు చెందిన వారు, ఒక్కరు మాత్రమే ప్రతిపక్ష యూడీఎఫ్‌ ఎమ్మెల్యే.
 
ఆరోగ్యమంత్రి కేకే శైలజ 60 వేల ఓట్ల మెజారిటీతో మత్తన్నూర్‌ నుంచి గ్రాండ్ విక్టరీ సాధించారు. 2016 ఎన్నికల్లో 8 మంది మాత్రమే గెలవగా, 1996లో 13 మంది మహిళలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.