శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 ఏప్రియల్ 2021 (20:44 IST)

కరోనా పుణ్యం- పాక్షిక లాక్ డౌన్: షిర్డీ సాయిబాబా ఆలయం మూసివేత..

కరోనా పుణ్యంతో గత ఏడాది సుప్రసిద్ధ ఆలయాలు మూతపడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా కరోనా తీవ్రత భారీగా వుంది. సెకండ్ వేవ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా దేశంలో లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. 
 
ఇలాంటి పరిస్థితుల్లో కరోనా నియంత్రణకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. పూర్తిస్థాయిలో కాకుండా పాక్షిక లాక్డౌన్‌లతో కోవిడ్ నియంత్రణ చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా కొన్ని ప్రసిద్ధ ఆలయాలు మూతపడకుండా కొన్ని గంటల పాటు మూతపడనున్నాయి. 
 
ఇందులో భాగంగా మహారాష్ట్రలోని షిర్డీలోని సాయిబాబా ఆలయం ఈరోజు రాత్రి 8 గంటల తర్వాత మూసివేయబడుతుంది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆలయం మూసివేసే ఉండనుంది. సాయిబాబా ఆలయంతో పాటు, 'ప్రసాదాలయ', 'భక్త నివాస్' కూడా మూసివేయబడతాయని తెలుస్తోంది. 
 
కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పాక్షిక లాక్ డౌన్ ప్రకటించిన క్రమంలో తర్వాత షిర్డీ ఆలయ పరిపాలన విభాగం ఈ నిర్ణయం తీసుకుంది. 
 
గత ఏడాది దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మాదిరిగానే తీవ్రమైన ఆంక్షలు విధించాలని రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం నిర్ణయించింది. ఈ పరిమితులు ఏప్రిల్ 30 వరకు ఉంటాయి అని చెబుతున్నారు. అలాగే, వారాంతపు లాక్‌ డౌన్లు కూడా రాష్ట్రం అంతా అమల్లోకి వస్తాయి. 
 
ఇక ఆ రోజుల్లో 144 సెక్షన్ రోజంతా విధించబడుతుంది. మామూలు రోజుల్లో కూడా రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల మధ్య సరైన కారణం లేకుండా పౌరులు తమ ఇంటిని వదిలి వెళ్ళలేరు. ఈ కర్ఫ్యూ నిబంధనల నుంచి అవసరమైన సేవలు మాత్రమే మినహాయించారు.