మహారాష్ట్రలో కరోనా విశ్వరూపం.. ముంబైలో ఐపీఎల్ మ్యాచ్‌లకు అనుమతి
మహారాష్ట్రలో కరోనా వైరస్ విశ్వరూపం చూపుతోంది. ప్రతి రోజూ 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదతువున్నాయి. ప్రభుత్వం కూడా పాక్షికంగా లాక్డౌన్ అమలు చేస్తోంది. రాత్రి పూట కర్ఫ్యూ విధించింది. ఈ నేపథ్యంలో ముంబైలో ఐపీఎల్ మ్యాచ్‍లకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు.
ఇదే అంశంపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, అన్ని ఆంక్షల నడుమ ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహిస్తామన్నారు. ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించడం లేదన్నారు. ఆటగాళ్లతో పాటు ఐపీఎల్‌తో సంబంధం ఉన్నవారంతా ఐసోలేషన్‌లో ఉండాలన్నారు. ఐపీఎల్ ఆటగాళ్లకు వ్యాక్సిన్ ఇవ్వాలని బీసీసీఐ డిమాండ్ చేసిందని, కానీ ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం కొన్ని ఆంక్షలు ఉన్నాయన్నారు.
అయితే ఐసీఎంఆర్ కొత్త ఆదేశాలను జారీ చేస్తేనే, దాని ప్రకారం వ్యాక్సినేషన్ జరిగే అవకాశం ఉందని మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు. కేంద్ర సంస్థ నుంచి అనుమతి రాగానే మరింత ఉదృతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్ 10వ తేదీ నుంచి ముంబైలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. కానీ అక్కడ ఉన్న బేస్ టీమ్స్‌లో కొందరికి కరోనా పాజిటివ్ రావడంతో ఐపీఎల్ మ్యాచ్‌లపై కొంత ఆందోళన నెలకొనడంతో మంత్రి వివరణ ఇచ్చారు.