భార్య, అత్తమామలను కారులోనే హతమార్చాడు.. సరే కన్నకూతురు సంగతేంటి?
కర్ణాటకలో భార్యతో ఏర్పడిన వివాదం కారణంగా అత్తమామలతో పాటు కట్టుకున్న భార్యను కూడా కారులోనే వుంచి హతమార్చాడు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, యాదగిరి జిల్లాకు చెందిన మునగల్ గ్రామానికి చెందిన నవీన్.. అన్నపూర్ణి అనే మహిళను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. నాలుగేళ్ల క్రితం వీరికి వివాహమైంది.
ఈ దంపతులకు ఓ అమ్మాయి వుంది. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య తగాదాలు వస్తుండేవి. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం భర్త నుంచి గొడవలతో పుట్టింటికి వెళ్లిపోయింది.
భార్యను తిరిగి ఇంటికి తెచ్చుకునేందుకు నవీన్ అత్తారింటికి వెళ్లాడు. దీంతో రాజీకొచ్చిన అన్నపూర్ణి తల్లిదండ్రులు.. ఆమెతో పాటుగా కారులో మెట్టినింట విడిచిపెట్టేందుకు వచ్చారు.
అలా వెళ్తుండగా అన్నపూర్ణి తల్లిదండ్రులతో నవీన్ మళ్లీ జగడానికి దిగాడు. దీంతో ఆగ్రహానికి గురైననవీన్ కారులోని ఇనుప కడ్డీతో అత్తమామలను, అన్నపూర్ణిని హతమార్చాడు.
ఆపై వారి మృతదేహాలు వేర్వేరు చోట్లా విసిరేసి.. పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో వున్న నవీన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కన్నబిడ్డ సంగతి నవీన్ మరిచిపోయాడు. తల్లిని, అత్తమామలను హత్య చేసి తన కన్నకూతురు భవిష్యత్తును మంటగలిపేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.