ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (22:06 IST)

పెళ్లయి 6 నెలలే, ఫోన్ మాట్లాడినందుకు అనుమానంతో కొట్టడంతో...

అడిగినంత కట్నం ఇచ్చారు. అందమైన భార్య. ఆర్థికంగా ఏ ఇబ్బంది లేని కుటుంబం. కొత్త పెళ్ళి జంట. ఇద్దరూ ఉన్నత చదువులు చదివారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా ఉన్నారు. రెండు చేతులా డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ ఒక చిన్న సమస్య వారి జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. 
 
వివాహమై ఆరునెలలే. చిత్తూరు జిల్లా గంగవరం మండలం జీడిమాకులపల్లెకు చెందిన సుబ్రహణ్యంశెట్టి రెండో కుమార్తె బిందుకి తిరుపతి కుమ్మరతోపులో నివాసముండే భానుసాయికి ఇచ్చి గత నెల ఆగష్టు 14వ తేదీ వివాహం చేశారు. ఇద్దరూ కలిసి హైదరాబాదులో కాపురం పెట్టారు.
 
ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. అయితే కరోనా కారణంగా ఇద్దరూ తిరుపతికి వచ్చేశారు. భానుసాయి వాళ్ళింట్లోనే ఉంటూ ఇక్కడి నుంచే ఉద్యోగాలు చేసేవారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో పాటు తాము పనిచేస్తున్న కంపెనీని బెంగుళూరుకు మార్చడంతో అక్కడికి వెళ్ళి పనిచేయాలనుకున్నారు.
 
బెంగుళూరు సిటీకి వెళ్ళి ఒక ఇల్లు చూసుకున్నారు. ఇంట్లో ఫర్నిచర్ కోసం అత్తమామలను డబ్బులు అడగమని భాను సాయి చెప్పాడు. పెళ్ళయిన తరువాత కూడా ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగడం ఏమాత్రం ఇష్టం లేదు బిందుకు. ఇదే విషయాన్ని భర్తకు చెప్పింది.
 
దీంతో భానుసాయి బిందును మానసికంగా ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. ప్రతిరోజు తనను భర్త కొడుతున్నాడంటూ తల్లిదండ్రులకు ఫోన్లో చెప్పేది బిందు. అయితే కుటుంబమన్న తరువాత గొడవలు ఉంటాయి, సర్దుకు పో అంటూ తల్లి బుజ్జగించింది. అయితే ప్రతిరోజు వాతలు పెడుతున్నట్లు తండ్రికి ఫోన్ చేసింది బిందు.
 
అంతేకాదు తాను స్నేహితులతో ఫోన్ మాట్లాడుతుంటే ఎవరితో మాట్లాడుతున్నావంటూ అనుమానం పడేవాడని కూడా బిందు తల్లిదండ్రులకు చెప్పింది. రోజూ కొడుతున్నాడు భర్త అంటూ చెప్పుకున్న బిందు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మీ అమ్మాయి చనిపోయిందంటూ అల్లుడు ఫోన్ చేశాడు.
 
దీంతో తల్లిదండ్రులు బెంగుళూరుకు వెళ్లేలోపు అల్లుడు పరారయ్యాడు. భానుసాయినే తమ కుమార్తెను చంపేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. భానుసాయి పరారీలో ఉన్నాడు.