పరాయి పురుషుడుతో భార్య అశ్లీల చాటింగ్ చేస్తే ఏ భర్త సహిస్తాడు: కోర్టు
పెళ్లయిన స్త్రీ పరాయిపురుషుడుతో అశ్లీలంగా చాటింగ్ చేస్తే ఏ భర్త మాత్రం సహిస్తాడని మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రశ్నించింది. వివాహానంతరం భార్యాభర్తలు స్నేహితులుగా హుందాగా, గౌరవంగా వ్యవహరించాలని, శృతి మించితే అది మనోవేదనకు దారితీస్తుందని కోర్టు అభిప్రాయపడింది. దిగువ కోర్టు మంజూరు చేసిన విడాకులను సవాల్ చేస్తూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ జస్టిస్ వివేక్ రొసియా, జస్టిస్ గజేంద్ర సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
భార్య మరో పురుషుడుతో అశ్లీల చాటింగ్ చేస్తే అది భర్త పట్ల క్రూరత్వంగా పరిగణించబడుతుందని కోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ (భార్య) తన పురుష స్నేహితుడుతో లైంగికపరమైన విషయాలు చర్చిస్తూ అసభ్యంగా సంభాషించినట్టు కోర్టు గుర్తించింది. ఈ తరహా ప్రవర్తనను ఏ భర్త సహించలేడని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
స్నహితులతో సంభాషణ మర్యాదగా ఉండాలని, హద్దులు దాటితే అది దాంపత్య జీవితానికి చోటుచేస్తుందని కోర్టు అభిప్రాయపడింది. ఒక వేళ జీవిత భాగస్వామికి అభ్యంతరం ఉన్నప్పటికీ అలాంటి కార్యకలాపాలను కొనసాగిస్తే అది నిస్సందేహంగా మానసిక హింస కిందకు వస్తుందని కోర్టు స్పష్టం చేసింది.
కాగా, గత 2018లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట మధ్య మనస్పర్థలు తలెత్తాయి. భార్య తన పాత ప్రియుళ్లతో అసభ్యంగా చాటింగ్ చేస్తోందని భర్త ఆరోపించగా, ఆమె వాటిని ఖండించింది. తన మొబైల్ హ్యాక్ చేసి తప్పుడు సందేశాలు సృష్టిస్తున్నారని ఆరోపించింది. అంతేకాకుండా, భర్త తన గోప్యతను ఉల్లంఘించాడని, రూ.25 లక్షలు కట్నం ఇవ్వాలని డిమాండ్ చేశాడని ఆరోపించింది.
అయితే, భర్త ఆరోపణలకు బలం చేకూరుస్తూ ఆమె తండ్రి కూడా తన కుమార్తె ప్రియుడుతో అసభ్యంగా చాటింగ్ చేసినట్టు సాక్ష్యం చెప్పడంతో దిగువ కోర్టు ఇచ్చిన విడాకుల తీర్పును హైకోర్టు సమర్థించింది.