శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , బుధవారం, 18 జనవరి 2017 (07:37 IST)

ఆవు దగ్గరకు పోతే అంతేనట : మంత్రి జ్ఞాన బోధ

ప్రపంచంలో ఆక్సిజన్‌ని మాత్రమే పీల్చుకుని మళ్లీ ఆక్సిజన్‌నే వదిలే ఏకైక జంతువు ఏదీ అంటే ఆవే అని సమాధానమిస్తున్నారీ రాజస్థాన్ మంత్రి. కాబట్టి ఆవుకున్న శాస్త్రీయ ప్రాధాన్యతను అర్థం చేసుకుని మసలుకోండోచ్ అం

ప్రపంచంలో ఆక్సిజన్‌ని మాత్రమే పీల్చుకుని మళ్లీ ఆక్సిజన్‌నే వదిలే ఏకైక జంతువు ఏదీ అంటే ఆవే అని సమాధానమిస్తున్నారీ రాజస్థాన్ మంత్రి. కాబట్టి ఆవుకున్న శాస్త్రీయ ప్రాధాన్యతను అర్థం చేసుకుని మసలుకోండోచ్ అంటూ జ్ఞానబోధ మొదలెట్టేశారీయన. రాజస్థాన్ లోని హింగోనియా గోశాల వద్ద జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సదరు మంత్రివర్యులు ఇలాంటి ఆసక్తికరమైన ప్రకటన చేసి పడేశారు. 
 
ఆయన పేరు వాసుదేవ్ దేవయాని. రాజస్థాన్ విద్య, పంచాయతీ రాజ్ మంత్రి. చదివింది ఇంజనీరింగ్. ఆవు గొప్పతనం ఆక్సిజన్‌ని పీల్చుకుని  ఆక్సిజన్ని బయటకు వదిలడం మాత్రమే కాదట. ఆవు దగ్గరకు వెళ్లి నిలుచుంటే చాలు జలుబూ, దగ్గూ మటుమాయమైపోతాయట. ఇంతటితో ఈ మంత్రివర్యుడు ఆగాడా అంటే ఆగలేదు. ఆవు పేడ విటమిన్ బి ఉంటుందట. అది రేడియో ధార్మిక శక్తినే అమాంతం పీల్చేసుకుంటుందట. 
 
ఇన్ని గొప్ప మాటలు ఆ మంత్రివర్యుడు ఎలా చెప్పగలిగాడు. అంటే గో సంరక్షణకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం రాజస్తానే మరి. ఆయన ఇంత గొప్ప ప్రకటనలు చేసిన ప్రాంతం హింగోనియా గోశాల. గత సంవత్సరం ఇక్కడే కేవలం రెండు వారాల వ్యవధిలో 500 ఆవులు ఉన్నఫళానా చనిపోయాయి. పైగా రాజస్థాన్ ప్రభుత్వం ఈ ఉదంతంపై లెక్కలు తీస్తే 2016 జనవరి నుంచి ఆగస్టు వరకు ఆ రాష్ట్రంలో 8,122 ఆవులు చనిపోయాయని తేలింది.
 
హిందువులు ఆవును పవిత్ర జంతువుగా భావించి పూజిస్తారు నిజమే. కానీ ఆవు ఆక్సిజన్‌ పీల్చి వదులుతుంది, దగ్గరికి పోయినంతనే జలుబు, దగ్గును మటుమాయం చేస్తుంది, రేడియో యాక్టివిటీనే తన పేడద్వారా పీల్చేసుకుంటుందనే రకం జ్ఞాన బోధకు మంత్రి స్థాయి వ్యక్తి  దిగిపోతే పోయేది ఆవు పరువా, మనిషి పరువా అనేది ఎవరికి వారు ఊహించుకోవలసిందే.