ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 21 జూన్ 2021 (05:51 IST)

ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి వెళ్తే ప్రజలు చెప్పులతో కొడతారు: ఉద్ధవ్ థాకరే

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి వెళ్తే ప్రజలు చెప్పులతో కొడతారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే అన్నారు. తాజాగా మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ ఎక్కడా కాంగ్రెస్ పేరు కానీ, మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ పేరు గానీ ప్రస్తావించలేదు.

ముంబైలోని శివసేన పార్టీ 55వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి ముందు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని అన్నారు.

తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్ ప్రచార బాధ్యతల దగ్గరి నుంచి ఎన్నికలకు సంబంధించిన పూర్తి తతంగాన్ని తాను చూసుకుంటానని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను కానీ కాంగ్రెస్, పటోలో పేర్లను కానీ ప్రస్తావించకుండా ‘‘ప్రజల అవసరాలను తీర్చకుండా ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే ప్రజలు చెప్పులతో కొడతారు. ఎన్నికల్లో పార్టీల అవసరాలను, పోటీకి సంబంధించిన పరిస్థితుల గురించి ప్రజలకు చెబితే అర్థం చేసుకోరు’’ అని ఉద్ధవ్ థాకరే అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘కూటమిలో ఉన్న ఏదేని పార్టీ కూటమిలోని పార్టీలతో చేతులు కలపకుండా ఒంటరిగా పోటీ చేయాలని అనుకుంటే, ఆ నిర్ణయం ప్రజలకు విశ్వాసాన్ని ధైర్యాన్ని అందించాలి. తమకు ఉద్యోగాలు ఇవ్వడానికి, జీవనోపాధి కల్పించడానికి ఏమున్నాయని ప్రజలు అడుగుతారు.

వాటిని నివృతి చేయాల్సిన బాధ్యత పార్టీలపై ఉంటుంది’’ అన్నారు. ‘‘కూటమి లేకుండా పోటీ చేయొచ్చని ఎవరైనా పిలుపునివ్వగలరు. శివసేన అధికారం కోసం తాపత్రయ పడదు. అలా అని ఇతరుల బరువును ఎత్తుకోదు. సాధారణ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకునే పని చేస్తుంది’’ అని ఉద్ధవ్ అన్నారు.