గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (11:54 IST)

ప్రణబ్ పార్థివదేహానికి రాష్ట్రపతి - ప్రధాని నివాళులు

అనారోగ్య కారణంగా తుదిశ్వాస విడిచిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్థివదేహానికి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీలు ఘన నివాళులు అర్పించారు. సోమవారం సాయంత్రం చనిపోయిన ప్రణబ్ ముఖర్జీ భౌతికకాయాన్ని మంగళవారం 10 రాజాజీ మార్గ్ నివాసానికి తరలించారు. 
 
అక్కడకు చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, మరికొందరు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అక్కడి ప్రణబ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.
 
అనంతరం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు పలువురు నాయకులు నివాళులు అర్పించారు. 11 నుంచి 12 గంటల మధ్య సామాన్య ప్రజలకు అనుమతి ఇస్తున్నారు. అనంతరం గార్డ్ ఆఫ్ హానర్ కార్యక్రమం ఉంటుంది.
 
కొవిడ్ నిబంధనల ప్రకారం ప్రణబ్ ముఖర్జీ భౌతిక కాయాన్ని శ్మశాన వాటికకు తరలిస్తారు. గన్ క్యారేజ్‌పై కాకుండా సాధారణ అంబులెన్సులోనే శ్మశాన వాటికకు తీసుకెళ్తారు. మధ్యాహ్నం 2 గంటలకు లోధి గార్డెన్‌లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా భౌతిక దూరం, నిబంధనలు పాటించేలా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.