శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 18 జనవరి 2017 (07:06 IST)

ఈయన బంధాలు తెంచుకోడట... ఆయన పార్టీని కాపాడుతూనే ఉంటాడట

కళ్లముందు ఇంత జరుగుతున్నా ఆ తండ్రీకొడుకుల మధ్య జుగల్ బందీ ఏమాత్రం విడిపోవడం లేదు. నాన్నతో నాబంధం ఎన్నటికీ తెగిపోదని ఒకరంటే .. పార్టీని కాపాడే పనిలోనే ఇంకా మునిగితేలుతున్నానని ఆ తండ్రి డైలాగుల మీద డైలాగులు సంధిస్తూనే ఉన్నారు.

ఇప్పటికే ఎంత పరువు పోవాలో అంతా పోయింది. తండ్రిని మించిన తనయుడు.. తనయుడికి తగ్గ తనయుడు ఆటలో ఉత్తరప్రదేశ్ గత వారం రోజులుగా తరించిపోయింది. పార్టీ నిలువునా చీలిపోయింది. వటవృక్షంలాంటి పెద్దాయన లెవల్ 38 సీట్లకు కొడుకును దేవిరించాల్సిన దుస్థితిలో పడిపోయింది. కళ్లముందు ఇంత జరుగుతున్నా ఆ తండ్రీకొడుకుల మధ్య జుగల్ బందీ ఏమాత్రం విడిపోవడం లేదు. నాన్నతో నాబంధం ఎన్నటికీ తెగిపోదని ఒకరంటే .. పార్టీని కాపాడే పనిలోనే ఇంకా మునిగితేలుతున్నానని ఆ తండ్రి  డైలాగుల మీద డైలాగులు సంధిస్తూనే ఉన్నారు. యూపీ రాజకీయం చూసి దేశ రాజకీయ నేతలందరూ ముక్కున వేలు వేసుకోవాల్సిందే మరి.
 
సమాజ్ వాదీ పార్టీ అధికార చిహ్నమైన సైకిల్ గుర్తు యూపీ సీఎం అఖిలేష్ యాదవ్‌కే చెందుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించి  ఒకరోజు కాకముందే అఖిలేష్ యాదవ్ నాన్నకు ప్రేమతో సినిమాను యూపీ ప్రజలకు చూపించడానికి రెడీ అయిపోయారు. తన తండ్రితో తనకు ఎన్నడూ విభేదాలు లేవని, తమ ఇద్దరి మధ్య బంధాన్ని ఎవ్వరూ బద్దలు చేయలేరని డైలాగ్ దంచారు. 
 
నా తండ్రితో నా బాంధవ్యం ఎన్నడూ చెరిగిపోదు. ఆయనతో నాకెప్పుడూ విభేదాలు లేవు. నిజానికి మా ఇద్దరి జాబితాలోని 90 శాతం అభ్యర్థులు వేర్వేరుగా కాకుండా ఒకేలా ఉన్నాయి అంటూ సన్నాయి నొక్కులు నొక్కాడు అఖిలేష్. 
 
రానున్న అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో కుదరకే సమాజ్ వాదీ పార్టీ కొంపకు నిప్పంటుకున్న విషయం తెలిసిందే. కాని ఇంత జరిగాక, ఇంతగా తండ్రికి ఎదురు తిరిగి, ఆయన ఇచ్చిన జాబితాను తోసిపుచ్చిన తర్వాత తమ మధ్య ఏమీ లేదని అఖిలేష్ అనడం చూసి ఔరా అని ఆశ్చర్యపోవడం ప్రజలవంతు అవుతోంది.
 
మరోవైపున తనయుడికి ఏమాత్రం తీసిపోని ములాయం ఒకవైపు తన ఉడుం పట్టుతో సర్వస్వం కోల్పోయినప్పటికీ బింకం వదలని ములాయం  ఇప్పటికీ పార్టీని కాపాడే పనిలోనే ఉన్నానని చెణుకు లేస్తున్నారు. కన్న కుమారుడికి తన జాబితాగా 38 మంది లిస్టును మాత్రమే పంపి ఓటమిని అంగీకరించిన ములాయం ఇప్పుడు పార్టీ రక్షకుడిగా ముందుకు రావడం  ప్రజల్లో నవ్వు తెప్పిస్తోంది 
 
ఇప్పుడు యుపీ రాజకీయాల్లో రెండు ట్యాగ్ లు అవతరించాయి
1. నాన్నకు ప్రేమతో... 2. కుమారుడికీ ప్రేమతోనే...
 
పాత తెలుగు సినిమా పాటను కూడా ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకుంటే బాగుంటుందేమో..
 
పచ్చబొట్టూ చెరిగీ పోదూలే నా రాజా....