శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 19 ఏప్రియల్ 2017 (07:50 IST)

దినకరన్‌ను కలవాలంటే శశికళకూ భయమే.. సీన్ మారిపోయింది.. నో ములాఖత్

ఢిల్లీ పోలీసులు అతడిని వెంటాడుతున్నారు. రేపో మాపో అరెస్టు చేయవచ్చు కూడా. ఇది ఎక్కడ తన మెడకూ కూడా చుట్టుకుంటుందో అనే భయంతో కర్నాటక జైలులో ఉన్న శశికళ అతడిని కలవడానికి కూడా ఒప్పుకోవడం లేదని సమాచారం.

ఎవరైనా ఒకసారి తప్పు చేసి దొరికితే కాస్త జాగ్రత్తగా ఉంటారు. రెండో సారి మళ్లీ తప్పు చేయాలంటేనే భయపడతారు. కానీ శశికళ మేనల్లుడికి ధనగర్వం, అధికారగర్వం రెండూ తోడైన అహంకారంతో కన్నూ మిన్నూ కానకుండా వ్యవహరించాడు. వంద కోట్లు ఖర్చు పెట్టి ఆర్కేనగర్‌ ఉపఎన్నికలో ఎలాగైనా సరే గెలిచి తీరాలన్న పట్టుదల వికటించినప్పుడూ వెనకా ముందూ చూసుకోవాలనిపించలేదు ఏకంగా కేంద్ర ఎన్నికల కమిషన్‌నే డబ్బుతో కొనేసి అన్నాడీఎంకే పార్టీ చిహ్నమైన రెండాకులను చేజిక్కించుకోవాలని ప్రయత్నించాడు. ఇప్పుడు అదీ వికటించింది. ఢిల్లీ పోలీసులు అతడిని వెంటాడుతున్నారు. రేపో మాపో అరెస్టు చేయవచ్చు కూడా. ఇది ఎక్కడ తన మెడకూ కూడా చుట్టుకుంటుందో అనే భయంతో కర్నాటక జైలులో ఉన్న శశికళ అతడిని కలవడానికి కూడా ఒప్పుకోవడం లేదని సమాచారం.

 
 
ఎన్నికల కమిషన్‌కు రూ.50 కోట్లు లంచం ఇవ్వడం ద్వారా రెండాకుల చిహ్నాన్ని పొందడం కోసం కర్ణాటకకు చెందిన సుకేష్‌ చంద్రశేఖర్‌ అనే బ్రోకర్‌ను ఆశ్రయించడం, అతను ఢిల్లీ పోలీసులకు సోమవారం పట్టుబడడంతో దినకరన్‌ బండారం బట్టబయలైంది. దినకరన్‌ ఇచ్చాడని చెబుతున్న రూ.1.30 కోట్లను సుకేష్‌ గది నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దినకరన్‌ను విచారించేందుకు అనుమతి పొందిన ఢిల్లీ పోలీసులు చెన్నైకి వచ్చి ఆయనను ఏక్షణమైనా అరెస్ట్‌ చేస్తారనే ప్రచారం జరిగింది.
 
సుకేష్‌ నుంచి సేకరించిన బలమైన సాక్ష్యాధారాలతో దినకరన్‌ను అరెస్ట్‌ చేసి ఢిల్లీకి తీసుకెళతారని అంటున్నారు. ఢిల్లీ పోలీసులు సుకేష్‌ను వెంట పెట్టుకుని బుధ, గురువారాల్లో చెన్నైకి చేరుకుంటారని తెలుస్తున్న నేపథ్యంలో దినకరన్‌ తన న్యాయవాదులతో మంగళవారం సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కాగా ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలోని ఒక అధికారి ద్వారా ఉన్నతాధికారిని మభ్యపెట్టే ప్రయత్నాలు సాగినట్లు తెలుస్తోంది. దీంతో సదరు అధికారిని సైతం అదుపులోకి తీసుకుని విచారించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ వ్యవహారంలో మరో ముగ్గురి పాత్ర ఉన్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు వారిని సైతం అరెస్ట్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.
 
ఐటీ దాడులు, ఢిల్లీ పోలీసుల కేసుల నేపథ్యంలో చిన్నమ్మను కలుసుకోవాలని దినకరన్‌ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ములాఖత్‌ ద్వారా శశికళను కలుసుకునేందుకు దినకరన్‌ సోమవారం ఉదయం బెంగళూరుకు వెళ్లారు. అయితే సాయంత్రం 6.30 గంటల వరకు ఆయన జైలు వద్దకు రాలేదు. శశికళను కలుసుకోలేదు. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ములాఖత్‌ సమయం కేటాయించినా దినకరన్‌ హాజరుకాలేదు. అన్నాడీఎంకేలో నెలకొన్న పరిణామాలపై శశికళ తీవ్ర అసంతృప్తితో ఉన్నందునే దినకరన్‌ను కలుసుకునేందుకు విముఖత ప్రదర్శించినట్లు సమాచారం.