గురువారం, 16 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 31 డిశెంబరు 2014 (16:59 IST)

చెన్నైలో ఆంధ్రా భవన్ ప్లీజ్... చంద్రబాబుకు కేతిరెడ్డి విన్నపం

చెన్నై నగరంలో ఆంధ్ర భవన్ నిర్మాణం కోసం గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్న తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి వినతిపత్రం అందించారు. ఈ వినతిపత్రంలో గతంలో ఆంధ్ర భవన నిర్మాణం కోసం ముఖ్యమంత్రి జయలలిత స్థలం కేటాయించారనీ, ఐతే అది నగరానికి చాలా దూరంగా ఉండటంతో తెలుగు సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో అది జీవో దశలోనే ఆగిపోయినట్లు పేర్కొన్నారు. 
 
ఈ నేపథ్యంలో నగరంలో అనువైన స్థలంలో భవన నిర్మాణానికి కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అభ్యర్థించారు. ఆంధ్ర భవన్ నిర్మాణంతో తమిళనాడు చుట్టుప్రక్కల ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాల ప్రజల అవసరాలకు, చెన్నైలోని తెలుగు సంఘాల కార్యక్రమాల నిర్వహణకు ఓ వేదిక కాగలదని ఆకాంక్షించారు. 

 
ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి చెన్నై నగరానికి వచ్చే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రతినిధులకు కూడా ఏపీ భవనం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆంధ్రభవన్ నిర్మించడం ద్వారా చంద్రబాబు నాయుడు పేరు చిరస్థాయిగా తెలుగు ప్రజల హృదయాలలో నిలిచిపోతుందని ఆయన వినతి పత్రంలో తెలియజేసారు. ఇంకా తమిళనాడులో తెలుగు అకాడమీ ఏర్పాటుకు కూడా కృషి చేయాలని కోరారు.