గేదెలు కొనుగోలు చేసేందుకు రెండో పెళ్ళికి సిద్ధమైన మహిళ... అత్తామామలు రావడంతో...
గేదెలు కొనుగోలు చేసేందుకు ఓ మహిళ రెండో పెళ్ళికి సిద్ధమైంది. మరికొన్ని క్షణాల్లో పెళ్ళి జరుగుతుందనగా అత్తామామలు వచ్చారు. దీంతో ఆ మహిళ షాకైంది. పెళ్ళి ఆగిపోయింది. ఈ ఆసక్తికర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
యూపీలోని హాసన్ పూర్‌కు చెందిన ఆస్మా అనే మహిళ మూడేళ్ల క్రితం నూర్ మహ్మద్‌ను పెళ్లి చేసుకుంది. అయితే, భర్తతో మనస్పర్థలు రావడంతో ఆరు నెలల క్రితం విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఈ కేసు ఇంకా కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇంతలోనే మరో పెళ్లికి సిద్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న నూర్ మహ్మద్ తల్లిదండ్రులు, పెళ్ళి సర్టిఫికేట్ తీసుకుని వివాహ వేదిక వద్దకు చేరుకున్నారు.
దానిని పరిశీలించిన తర్వాత నిర్వాహకులు పోలీసులను పిలిపించి ఆస్మా, ఆమెకు కాబోయే భర్తపై ఫిర్యాదు చేశారు. విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావని ప్రశ్నించగా, ఇది కేవలం ఓ నాటకమని, పెళ్ళి జరిగిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే డబ్బును చెరిసంగ పంచుకునేలా ఒప్పందం చేసుకున్నామని ఆస్మా వెల్లడించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు.