ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 జులై 2021 (17:43 IST)

యూపీలో కొత్త జనాభా చట్టం... ఆ వర్గం వారే టెర్గెట్టా?

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తాజాగా జనాభా నియంత్రణ చట్టాన్ని విడుదల చేసింది. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2021-2030కిగానూ ఆ చట్టాన్ని విడుదల చేశారు.
 
ప్రస్తుతం రాష్ట్ర సంతాన రేటు 2.7 శాతం ఉండగా 2030 నాటికి సంతాన రేటును 1.9కి తీసుకురావాలన్న లక్ష్యాన్ని అందులో నిర్దేశించారు. 2026 నాటికి 2.1 శాతానికి తీసుకురావాలని తలపెట్టారు. 
 
పెరుగుతున్న జనాభాతో రాష్ట్రంతో పాటు దేశాభివృద్ధికి అవరోధం ఏర్పడుతుందని ఆయన అన్నారు. పెరుగుతున్న పేదరికానికి జనాభా పెరుగుదలే కారణమన్నారు. ప్రతి ఒక్కరూ, ప్రతి వర్గమూ కొత్త జనాభా చట్టాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఈ చట్టంపై 2018 నుంచి కసరత్తులు చేస్తున్నామని తెలిపారు. 
 
అయితే, ఈ చట్టానికి సంబంధించిన ముసాయిదా ప్రతిని రాష్ట్ర న్యాయశాఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో మార్పుచేర్పుల కోసం సలహాలు, సూచనలకు ఈ నెల 19 వరకు గడువిచ్చింది.
 
మరోవైపు, జనాభా నియంత్రణ బిల్లుపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం బిల్లు తీసుకు వచ్చేముందు ఒక పని చేయాలని, తమ చట్టబద్ధ సంతానంపై మంత్రులు, ప్రభుత్వ నేతల నుంచి ముందు సమాచారం కోరాలని సూచించారు. 
 
యోగి తీసుకువస్తున్న నూతన జనాభా విధానం ప్రకారం, ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగిన వారు స్థానిక సంస్థల్లో పోటీ చేసే అర్హత కోల్పోతారు. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు, సబ్సిడీలు పొందేందుకు అనర్హులవుతారు.