శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 నవంబరు 2020 (19:54 IST)

కరోనా.. గంగానదిలో కార్తీక పౌర్ణమికి స్నానాల్లేవ్..

కార్తీక పౌర్ణమి పర్వదినం ఈ నెల 30వ తేదీన రానుంది. ఈ సందర్భంగా ప్రజలు పుణ్య తీర్థాల్లో స్నానమాచరిస్తారు. అయితే ఈ నెల 30న కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు గంగానదిలో స్నానాలు చేసేందుకు హరిద్వార్ జిల్లా అధికారులు అనుమతి నిరాకరించారు. కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఈసారి పుణ్యస్నానాలను నిషేధించినట్టు అధికారులు ప్రకటించారు.
 
పుణ్యస్నానాల కోసం ప్రజలు పెద్దఎత్తున ఘాట్లలో గుమికూడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి అంటు వ్యాధుల నిరోధక చట్టం 1897తో పాటు విపత్తుల నిరోధక చట్టం 2005 కింద చర్యలు తీసుకుంటామన్నారు.
 
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏటా ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ సహా దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాల కోసం గంగానదీ తీరానికి వస్తారు. అయితే కోవిడ్-19 నేపథ్యంలో కేంద్రం వెలువరించిన మార్గదర్శకాలను అనుసరించి ఈ ఏడాది కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రజలు నదీస్నానాలు ఆచరించడాన్ని నిలిపివేయాలని నిర్ణయించినట్టు హరిద్వార్ జిల్లా కలెక్టర్ సి. రవిశంకర్ పేర్కొన్నారు.