గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 25 జూన్ 2024 (16:00 IST)

దేశంలో పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్ రైలు...

vande bharat sleeper
దేశంలో వందే భారత్ రైళ్లకు విశేష ఆదరణ లభిస్తుంది. ఇప్పటివరకు కేవలం పగటి పూట మాత్రమే నడిపేందుకు అనువుగా ఈ రైళ్లను తయారు చేశారు. అయితే, వీటికి లభిస్తున్న ఆదరణ చూసిన రైల్వే శాఖ స్లీపర్ క్లాస్ వందే భారత్ రైళ్ళ తయారీపై దృష్టిసారించింది. ఈ స్లీపర్‌ ట్రైన్‌ను మరో రెండు నెలల్లో అంటే ఆగస్టు 15 నాటికి ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చే అవకాశం ఉందని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ తొలి స్లీపర్ క్లాస్ వందే భారత్ రైలును కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు ప్రారంభించిన అన్ని వందే భారత్ రైళ్ళకు ఆయనే జెండా ఊపి ప్రారంభించిన విషయం తెల్సిందే. 
 
ఇదిలావుంటే, ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్లీపర్‌ రైలు పనులను పర్యవేక్షించడానికి బెంగళూరు వెళ్లారు. వందేభారత్ స్లీపర్ రైలు తయారీ చివరిదశలో ఉందని తెలిపారు. దేశంలోనే మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్ రైలు ఢిల్లీ, ముంబై రైల్వే మార్గంలో నడుస్తోందని, రద్దీగా ఉండే ఈ మార్గంలో స్లీపర్ రైలును అందుబాటులోకి తీసుకువస్తే ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. స్లీపర్‌ ట్రైన్‌ ఢిల్లీ నుంచి భోపాల్‌, సూరత్‌ మీదుగా ముంబై చేరుకుంటుందని తెలిపాయి. 
 
త్వరలో పట్టాలెక్కనున్న ఈ స్లీపర్ రైల్లో మొత్తం 16 బోగీలు ఉంటాయని అందులో 10 థర్డ్ ఏసీకి, 4 సెకండ్ ఏసీకి, ఒక బోగీ ఫస్ట్ ఏసీకి కేటాయించారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. వందే భారత్‌ స్లీపర్ రైలులో సీటింగ్‌తో పాటు లగేజీ కోసం రెండు బోగీలు అందుబాటులో ఉంటాయి. గంటకు 130 కి.మీ. వేగంతో నడిచే ఈ రైలు వేగాన్ని కొద్ది రోజుల అనంతరం క్రమంగా గంటకు 160-220 కి.మీ.లకు పెంచుతామని కేంద్ర రైల్వే మంత్రి తెలిపారు.