శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 ఏప్రియల్ 2021 (13:58 IST)

నాకు మాస్క్ లేదు.. నా భర్తను ముద్దుపెట్టుకుంటా... ఆపగలవా?

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో నిమగ్నమైంది. భారీగా కేసులు నమోదవుతుంటడంతో నిబంధల్ని కఠినంగా అమలు చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఒక వారం రోజుల పాటు లాక్డౌన్ విధించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అయితే ఓ జంట మాత్రం లాక్డౌన్‌ రూల్స్‌ పాటించకుండా చక్కర్లు కొడుతూ, మాస్క్‌ లేదని అడిగిన పోలీసులకు వింతగా సమాధానమిచ్చారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని దరియాగంజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
లాక్డౌన్‌ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు మాస్కు లేకుండా కారులో వెళ్తున్న ఓ జంటను ఆపారు. కారులో వెళ్తున్నా కూడా మాస్క్ ధరించాలని సూచించారు. కర్ఫ్యూ సమయంలో తిరుగుతున్నందుకు పాస్‌ ఉండాలని చెప్పారు. దీంతో కారులోంచి బయటకు వచ్చిన మహిళ పోలీసులపై రెచ్చిపోయారు.
 
‘నాకు మాస్క్‌ లేదు.. అయితే నా భర్తను ముద్దు పెట్టుకుంటా.. నన్ను ఆపగలవా’ అంటూ పోలీసులనే ఎదురు ప్రశ్నించింది. అనంతరం ఆమె భర్త కూడా నా కారు ఎందుకు ఆపావు అంటూ పోలీసులను నిలదీశారు. నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా. విధుల్లో పోలీసులతో దురుసుగా మాట్లాడినందుకు ఆ జంటపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే, కారు ఆపినందుకు ఆ జంట చేసిన హల్‌చల్  ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.