నిలువెత్తు రూపం.. నిండైన విగ్రహం.. పంచె కట్టయినా, పంట్లామైనా.. లాయర్ కోటైనా... కేవలం పైపంచే అయినా... ఏ కాస్ట్యూమయినా అలా ఒదిగిపోయేది ఆయన శరీరంపై... అందుకే.. అటు పౌరాణికం, ఇటు సాంఘిక చిత్రమేదైనా.. ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. ''కథే'' అసలైన నాయకుడు, నాయకురాలుగా భావించిన కాలంలో... పౌరాణికమైనా, జానపదమైనా, సాంఘికమైనా నిర్మాతలకు, దర్శకులకు ముందుగా జ్ఞాపకం వచ్చే అరుదైన కళాకరులతో అగ్రగణ్యుడుగా ఎన్నదగిన వారిలో ఎస్వీఆర్ ఒకరు.
అందుకే.. ''వివాహ భోజనంబు, విందైన వంటకంబు'' అన్న ఘటోత్కచుడిగా.. పాతాళ భైరవిలో మాంత్రికుడిగా ''సాహసం సేయరా ఢింబకా'' అంటూ... అనార్కలిలో అక్బర్ పాదుషా, ''ఉషా పరిణయంలో '' బాణా సురిడిగా.. బాల భారతంలో ''భీష్ముడి''గా.. మహాకవి కాళిదాసులో '' భోజుడి''గా, దక్షయజ్ఞంలో ''దక్షుడి''గా, పాండవ వనవాసంలో ''దుర్యోధనుడి''గా, భక్త ప్రహ్లాదలో'' హిరణ్య కశ్యపుడి"గా యశోదాకృష్ణలో, శ్రీకృష్ణలీలలో ''కంసుడి''గా, భూకైలాస్‌లో ''మాయాసురిడి''గా, వినాయకచవితిలో ''నరకాసురిడి''గా, సారంగధరలో ''రాజరాజ నరేంద్రునిగా''గా, బొబ్బిలియుద్ధంలో ''తాండ్ర పాపారాయుడి''గా, సతీ సావిత్రిలో ''యముడి''గా... అన్నింటికీ మించి ''నర్తనశాల''లో కీచకుడిగా.. ఎస్వీ రంగారావుని ఓ వ్యక్తిగా చూడగలమా? ఆ పాత్రకు నిలువెత్తు రూపంగా ప్రాణం పోసిన కళాకారుడిగా తప్ప.
నందమూరి తారక రామారావు పెద్ద కొడుకుగా, అక్కినేని నాగేశ్వరరావు చిన్న కొడుకుగా పోషించిన గుండమ్మ కథలో తండ్రి రామ భద్రయ్యగా, బందిపోటు దొంగలలో '' బందిపోటు మల్లుదొర ''గా, తాతా మనవడిలో తాతగా, లక్ష్మీ నివాసంలో ఆస్థంతా పోయినా శ్రమను నమ్ముకున్న ధనవంతుడిగా, భలే పాపలో అంధుడిగా, షావుకారులో '' సున్నపు రంగడు''గా, అల్లావుద్దీన్ అద్భుత దీపంలో '' మాంత్రికుడి'' గా, అప్పు చేసి పప్పుకూడులో ''దివాన్ బహుదూర్ ముకుందరావు ''.. తండ్రి, తాత... జమీందార్ పాత్రలలో సామర్ల వెంకట రంగారావు నాయుడిని తప్ప... మరొకరిని ఆ తరంలో ఊహంచగలమా ?
మూకీ సినిమాల నుండే టాకీల ప్రస్థానం ప్రారంభమయిన కాలంలో ఎంతోమందిని ''వెండితెర'' ఆకర్షించినట్లుగానే... ఆ కుర్రాడిని సైతం ... తన ఒడిలోకి ఆహ్వానించింది. కృష్ణాజిల్లా, నూజివీడులో ఎక్సైజ్ ఇన్స్పెక్టరయిన తండ్రి సామర్ల కోటేశ్వరరావు.. ముందు చదువు.. తర్వాత నాటక రంగం... సినిమా రంగమన్నారు. కొడుకేం చేసినా ''లక్ష్మి'' గారికి అభ్యంతరం లేదు. హిందూ కాలేజీలో చదువుతూనే నాటక రంగంలో ఓనమాలు దిద్ది... మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో బీఎస్సీ చదువు ముగించిన తర్వాతే సినిమా ప్రయత్నాలు ప్రారంభించారు.
అప్పట్లో సినిమా పరిశ్రమ '' సేలం'' లో ఎక్కువగా ఉండేది. ఎస్వీఆర్‌కి ''వరూధిని''లో తొలి అవకాశం ... కుటుంబానికి సన్నిహితులు, బంధువైన బీవీ. రామానందంగారిచ్చారు. వరూధిని తర్వాత '' పల్లెటూరి పిల్ల'' లో ప్రతినాయకుడి అవకాశం ఇచ్చారు బీఏ. సుబ్బారావు గారు. ఆ తర్వాత ఎస్వీఆర్ వెనుదిరిగి చూసే అవకాశమే లేకుండా రకరకాల పాత్రలతో నిర్మాతలు ఆయన ఇంటి ముందు నిలబడ్డారు. తత్ఫలితంగా టాటా కంపెనీలో చేస్తున్న ఉద్యోగం వదిలేసి పూర్తిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. దాదాపు 27 సంవత్సరాల నట జీవితంలో అర్థాంగిగా అన్ని విధాలా సహకరించారు బడేటి లీలావతి గారు. కూతుళ్లు విజయ, ప్రమీల, కొడుకు కోటేశ్వరరావుల పెంపకం బాధ్యతను సంపూర్ణంగా స్వీకరించి తన భర్త నటజీవితానికి ఆలంబనగా నిలబడ్డారు.
అందుకే ఎస్వీఆర్ 157 సినిమాలను తన ఖాతాలో జమ చేసుకోగలిగారు. తన కెరీర్‌లో భారత రాష్ట్రపతి పురస్కారాన్ని ఐదుసార్లు పొందారు ఈ ''విశ్వనట చక్రవర్తి ''. నర్తనశాలలో కీచకుడి పాత్రకు... 1963లో జకార్తాలోని ఇండోనేషియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడిగా పురస్కారాన్ని స్వీకరించారు ఈ '' నటసార్వభౌముడు''. ఆంధ్రప్రదేశ్ ఉన్నత పురస్కారాలైన బంగారునందిని '' చదరంగం'' సినిమాకి 1967లోనూ.. వెండి నందిని ''బాంధవ్యాలు'' సినిమాకు 1968లో '' దర్శకుడి ''గా గెలుపొందారు ఈ '' నట శేఖరుడు ''. అభిరుచి గల నిర్మాతగా '' నాదీ ఆడజన్మ'', '' సుఖ దు:ఖాలు'' నిర్మించారు ఈ '' నట సింహ ''. పోస్టల్ డిపార్టుమెంట్ వారు సైతం ఎస్వీఆర్ స్మారక తపాలా బిళ్లను విడుదల చేసి.. ఎస్వీఆర్ పట్ల తమ అభిమానాన్ని ప్రకటించారు.
1918 సంవత్సరంలో జూలై 3న పుట్టిన ఎస్వీఆర్ జీవితంలో సినిమా కష్టాలు తక్కువేనంటారు సన్నిహితులు. ఆనాటి తరం తండ్రిగా, స్నేహితుడిగా, గురువుగా ఎన్నో రూపాల్లో అభిమానించారు ఎస్వీఆర్‌ని. కెరీర్ ఉన్నత స్థితిలో ఉండగానే.. ఆకర్షణీమయమైన సెల్యులాయిడ్ ప్రపంచంలోని .. బలహీనతల్లో ఒకటైన 'మద్యాని'కి మిత్రుడయ్యారు ఎస్వీఆర్. తత్ఫలితంగా నిర్మాతలకు.. సాటి కళాకారులకు కాస్త ఇబ్బంది కలిగిందన్నది వాస్తవం. అయినా ఆయనపై అభిమానాన్ని ఎవరూ కోల్పోలేదు. ''వ్యసనాలు ఈ లోకం నుండే సరాసరి చూపించే మార్గాలు మరణానికి '' అన్న మాట నిజం చేస్తూ 56 సంవత్సరాల వయస్సులోనే 1974 జూలై 18న గుండెపోటుతో మరలిరాని లోకానికి పయనమైపోయారు. భౌతికంగా ఎస్వీఆర్ నిష్క్రమణ జరిగి 41 సంవత్సరాలయినా నేటికీ ఏదో ఒక ఇంట.. ఏదో ఒక కార్యక్రమంలో ఆయన కనబడుతూనే ఉంటారు. రంగారావుగారు కళాకరుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తనదైన శైలిని ఈ ప్రపంచంలో శాశ్వతంగా వదిలిపోయినా ఆ అరుదైన కళాకారుడికి 41వ వర్థంతి సందర్భంగా అక్షరాంజలి.