Shani Trayodashi 2025: శని త్రయోదశి నాడు ఏం చేయాలి?
శనైశ్చరుడి అనుగ్రహం కోరుకుంటున్నవారు ఏలినాటి శని దశ, అష్టమశని, అర్ధాష్టమశని దశ నడుస్తున్నవారు, శని మహర్దశ, అంతర్దశలో ఉన్నవారితో పాటు అందరూ శనైశ్చరుడిని ప్రార్థించి, పూజించి ఉపశమనం పొందవచ్చు. ప్రత్యేక శనైశ్చర ఆలయాల్లోగాని, లేదా నవగ్రహ మండపంలో ఉన్న శనైశ్చరస్వామికి తైలాభిషేకం చేసి నువ్వులను దానం చెయ్యాలి. ముందు శివలింగాన్ని అభిషేకించి అర్చనలు చేసి ఆ తర్వాత శనైశ్చరుని ఆరాధిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి.
అంతేకాక ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించి, ప్రదక్షిణలు చేసినా ప్రయోజనం ఉంటుంది. శనైశ్చరుడికి ప్రియమైన ఇనుము, నీలం, మేకులు, నువ్వులు, నువ్వులనూనె, నల్లని వస్త్రాలు వంటివి దానం చేయడం కూడా మంచిదే. ఈ రోజు పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం, గోవులకు తెలకపిండిని పెట్టడం వల్ల కూడా చాలా ఉపశమనం కలుగుతుంది.
వీటన్నింటికి తోడు శనైశ్చరుడి ఆలయంలో నువ్వుల అన్నాన్ని నైవేద్యంగా సమర్పించడం, నల్ల ఆవు పాలను అన్నంలో కలిపి దానిని శివుడికి నివేదించడం, నల్ల ఆవు పాలతో ప్రదోషంలో శివుడికి అభిషేకం చేయడం, శనైశ్చరుడి ముందు దీపపు ప్రమిదలో నల్లని నువ్వులు వేసి నువ్వులనూనెతో దీపాలు వెలిగించడం చేయాలి.
ఇవేవీ చేయలేకపోయినా ప్రతిరోజు భోజనానికి ముందు పిడికెడు అన్నాన్ని కాకికి పెట్టడం కూడా ఆయన అనుగ్రహం కలిగేలా చేస్తుంది.